పోటీ చేయని వారే ధన్యులా?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. టీడీపీ నుంచి టికెట్ ఇచ్చిన వారిదే పాపం అన్నట్లుగా అంతా దాదాపుగా గెలిచారు. ఉత్తరాంధ్రలో అయితే స్ట్రైక్ రేటు 99 శాతంగా ఉంది. మొత్తం 34 అసెంబ్లీ…

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. టీడీపీ నుంచి టికెట్ ఇచ్చిన వారిదే పాపం అన్నట్లుగా అంతా దాదాపుగా గెలిచారు. ఉత్తరాంధ్రలో అయితే స్ట్రైక్ రేటు 99 శాతంగా ఉంది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు 32 కూటమి గెలుచుకుంది. దాంతో అందరూ మంత్రి పదవులు కోరుకున్నారు. కానీ చంద్రబాబు తనదైన ఆలోచనలతో మంత్రి మండలిని కూర్పు చేశారు. భవిష్యత్తు అవసరాలు కూడా చూసుకుని కొత్తవారికి యువతకు చాన్స్ ఎక్కువగా ఇచ్చారు.

దాంతో సీనియర్లు జస్ట్ అలా ఎమ్మెల్యేలుగానే మిగిలిపోవాల్సి వస్తోంది. ఇది వారికి మోయలేని వేదనగానే ఉంది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. అత్యంత సీనియర్ అయిన అయ్యన్నపాత్రుడుకు స్పీకర్ ఇచ్చారు. ఆయనతో పాటు ఉన్న వారు తరువాత వచ్చిన వారు చాలా మంది మనకేంటి అని ఆలోచిస్తున్నారు.

స్పీకర్ గా అయ్యన్నను అభినందిస్తూ అసెంబ్లీలో మాట్లాడిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అయ్యన్నది తమదీ 1983 బ్యాచ్ అని సభలో గుర్తు చేశారు. ఆ విధంగా అధినాయకత్వానికి ఆయన పరోక్షంగా తెలియచేశారు అని అంటున్నారు. మంత్రి పదవులతో సరిసాటి ఏముంటుంది ఇవ్వడానికి అని కూడా మరో వైపు డిస్కషన్ సాగుతోంది.

ఇవన్నీ పక్కన పెడితే ఈసారి ఎన్నికల్లో పొత్తులలో భాగంగా టికెట్లు దక్కని వారు త్యాగమూర్తులుగా ఉన్న వారికే రానున్న కాలంలో అవకాశాలు కల్పించడానికి టీడీపీ ఆలోచిసోందని అంటున్నారు. అలా పోటీ చేయని వారికే ఇపుడు ప్రయారిటీ దక్కుతోందని అంటున్నారు. అలా వారంతా ధన్యులు అయ్యారని అంటున్నారు.

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తారని కూడా అంటున్నారు. అలాగే మరికొందరికి రాజ్యసభ పదవులు కూడా దక్కే అవకాశాలు రానున్న రోజులలో ఉన్నాయని అంటున్నారు. దాంతో పోటీ చేయకుండా త్యాగరాజులు అనిపించుకున్నా సరిపోయేది నామినేటెడ్ పదవులు కీలక పోస్టులలో తమకు అవకాశం వచ్చేదని పలువురు తర్కించుకుంటున్నారుట. 

అయినా అయ్యన్న పాత్రుడు చెప్పినట్లుగా టికెట్ పార్టీ ఇవ్వడమే గొప్ప దాని కంటే ఏమి కావాలని అంటున్న వారూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలుగా ఈ అయిదేళ్ళ కాలం సీనియర్లు గడపాల్సిందే అని అంటున్నారు. పార్టీ ఆలోచనలు వేస్తున్న అడుగులు చూస్తే అరవైలు దాటిన వారికి ఇక సీనియర్ ఎమ్మెల్యే హోదా తప్ప వేరొకటి దక్కదనే అంటున్నారు.