చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తర్వాత సోమవారం మొదటి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంపై ఏపీ ప్రజానీకంలో ఉత్కంఠ నెలకుంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇతరత్రా హామీలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇంత వరకూ సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కీలక మంత్రి లోకేశ్ తదితర కేబినెట్ సభ్యులెవరూ నోరు మెదపడం లేదు.
దీంతో సంక్షేమ పథకాల అమలుపై రకరకాల ప్రచారం జరుగుతోంది. నిబంధనల్ని కఠినతరం చేస్తారనే ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్లో అధికారికంగా తీసుకునే నిర్ణయమై ఫైనల్ కావడంతో, అది ఎలా వుంటుందో అనే ఉత్కంఠ నెలకుంది. మరోవైపు జూలై 1న పెంచిన పింఛన్‌ను కలుపుకుని మొత్తం రూ.7 వేలు అందజేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న 66 లక్షల మంది లబ్ధిదారులకు అందజేయనున్నారా? లేక మార్పు ఏదైనా చేస్తారా? అనే చర్చకు తెరలేచింది.
కూటమి ప్రభుత్వానికి మేనిఫెస్టో అమలు అతిపెద్ద టాస్క్. అలివికాని హామీలిచ్చారని వైసీపీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీల్ని ప్రజలు నమ్మి, కూటమికి పట్టం కట్టారు. హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై వుందని పవన్‌కల్యాణ్ ఒక్కరే పదేపదే చెబుతున్నారు.
హామీల అమలుపై చంద్రబాబు మనసులో ఏముందో ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో స్పష్టం కానుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై కూటమి ప్రభుత్వంపై మొదట్లోనే మంచి, లేదా చెడు ప్రభావం పడనుంది. అందుకే కేబినెట్ నిర్ణయంపై అందరి ఎదురు చూపు.