పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే థియేటర్లకు వుండే ప్రెజర్ మామూలుగా వుండదు. ఆ సినిమా నిర్మాతకు కూడా మామూలు ప్రెజర్ వుండదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, ఆదిపురుష్ ఇప్పుడు కల్కి ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లకు నిర్మాతకు బుర్ర మెంటలెక్కిపోతుంది. ఇన్ కమ్ టాక్స్, పోలీస్, ఫైర్ ఇలా చాలా చాలా శాఖల నుంచి వత్తిడి వుంటుంది. నిర్మాత బంధుగణం సంగతి చెప్పనక్కరలేదు. అదే విధంగా డిస్ట్రిబ్యూటర్ కు, థియేటర్లకు కూడా ఇదే సమస్య. ట్రాఫిక్ పోలీస్, ఫైర్, లోకల్ పోలిటీషియన్స్ ఇలా చాలా చాలా వత్తిడులు వుంటాయి.
దాంతో థియేటర్లు చాలా వరకు టికెట్ లను ఆన్ లైన్ సేల్స్ కు వుంచవు. దాంతో ఆన్ లైన్ లో టికెట్ లు, షో లు చూపిస్తుంటాయి కానీ క్లిక్ చేస్తే ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తూ వుంటుందన్నది ట్రేడ్ వర్గాల బోగట్టా. ఇది ఒక సమస్య.
కల్కి సినిమా నాన్ సీజన్ లో విడుదలవుతోంది. పైగా నెలాఖరులో విడుదలవుతోంది. దానికి తోడు మితిమీరిన టికెట్ రేట్లు. మల్టీ ఫ్లెక్స్ లో సినిమా చూడాలంటే 450 రూపాయలు కేవలం టికెట్ కు ఖర్చు చేయాలి. అదే సింగిల్ స్క్రీన్ లో చూడాలంటే 200 నుంచి 250 ఖర్చు చేయాల్సి వుంటుంది.
తొలి రోజు సినిమా చూసే వాళ్లలో ఎక్కువ యూత్, అభిమానులు వుంటారు. టికెట్ రేట్ల పెంపు ప్రభావం వాళ్ల మీద ఓ మాదిరిగా వుంటుంది. మిగిలిన జనరల్ ఆడియన్స్ మీద ఎక్కువ వుంటుంది. సినిమాకు టాక్ సూపర్ గా వుంటే టికెట్ రేట్ల ప్రభావం ఏమీ వుండదు. తొలివారం మొత్తానికి టికెట్ రేట్లు తెచ్చినా సమస్య కాదు. కానీ డివైడ్ టాక్ వస్తే మాత్రం సమస్య అవుతుంది.
ఇప్పటికే కొన్ని సింగిల్ థియేటర్లు కాస్త తక్కువే పెట్టాయి రేట్లు. సినిమా టాక్ ను బట్టి మండే నుంచి టాక్స్ పే చేసి మరీ రేట్లు తగ్గించుకుంటారా? టాక్ బాగుంటే అలాగే వుంచుతారా? ఇవన్నీ తెలియాల్సి వుంది.