ఏ మనిషికి అయినా అంతఃసమీక్ష ఒకటి అవసరం. అది ఏ దశలో అయినా, ఏ వయసులో అయినా, ఏ పని చేస్తున్నా, ఏ స్థాయిలో ఉన్నా.. తను చేస్తున్నదేంటి, దాని పర్యవసనాలు ఎలా ఉంటయనే అంశం గురించి సమీక్షించుకోవాలి! అతడెంత ఛాంపియన్ అయినా, ఎంత పెద్ద వ్యాపార వేత్త అయినా, ఏ స్థాయి ఆటగాడు అయినా.. తన తీరుతెన్నుల గురించి సమీక్షించుకోకుంటే అక్కడే అతడి పతనం మొదలవుతుంది! దీనికి తను కూడా ఏ మాత్రం మినహాయింపు కాదని.. ఈ పాటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థమయి ఉంటే ఆయనకే మంచిది! జగన్ ఓడిపోయాడు కాబట్టి.. ఇప్పడు ఎవరు ఎన్నైనా చెబుతారు, ఆయనకు హితబోధలు దండిగా ఉంటాయనే వాదనను కాసేపు పక్కన పెడితే, జగన్ తన తీరుతో సొంత పార్టీ నేతలకే ఎంతో చేటు చేశారనేది చాలా నిష్టూరమైన వాస్తవం!
సంక్షేమ పథకాల లబ్ధిదారులు గంపగుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు.. అనేది స్వయంగా జగన్ చేసిన, చేసుకున్న ప్రచారం! ఒకటి కాదు రెండు కాదు.. తన పాలనలో ఆఖరి మూడేళ్లలో జగన్ నిత్యం బటన్ నొక్కుడు గురించే మాట్లాడాడు! అది ఇచ్చా, ఇది ఇచ్చాం, అన్నీ ఇస్తున్నాం.. కాబట్టి జనాలంతా గంపగుత్తగా ఓటేసి పార్టీని భారీ స్థాయిలో గెలిపిస్తారంటూ జగన్ ప్రచారం మొదలుపెట్టాడు మూడేళ్ల కిందట! ఆ ప్రచారం ఎంత ప్రభావం చూపించిందంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రౌండ్ లెవల్లో పని చేసుకునే కార్యకర్తలు, నేతలు కూడా జగన్ మాటను నమ్మారు! ఎంతలా అంటే.. తమ పార్టీ తిరుగులేని మెజారిటీతో నెగ్గుతుందని వారు భావించారు.
ఎమ్మెల్యేలు అయితే.. జగన్ మాటలను పదే పదే వినీ, ఇక క్యాడర్ కూడా అవసరం లేదని.. సంక్షేమ పథకాల లబ్ధిదారులు డైరెక్టుగా వెళ్లి ఫ్యాన్ కు ఓటేస్తారు కాబట్టి, తాము ఇక ఏం చేసినా ఫర్వాలేదని, జగన్ చెప్పినట్టుగా ఇంటింటికీ తిరిగి, అది అందిందా, ఇది అందిందా.. అంటూ వాకబు చేస్తే చాలని, అవన్నీ అందాయని పదే పదే గుర్తు చేస్తూ ఉంటే చాలు! అని వారు భావించారు! ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గాడి తప్పింది! సంక్షేమ పథకాల మీద అతి విశ్వాసంతో ఆఖరికి పార్టీ క్యాడర్ ను కూడా వారు పట్టించుకోకుండా తయారయ్యారు!
ప్రతి పంచాయతీ స్థాయి గ్రామంలోనూ పార్టీ క్యాడర్ అనదగ్గ ఫ్యామిలీల్లో కనీసం ఐదారు దూరం అయ్యాయి. అలాంటి వారు 2019 ఎన్నికల్లోనే కాదు, 2014 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. వాళ్లను మామూలుగా అయితే ఎమ్మెల్యేలు కాపాడుకునే వారే! ఎందుకంటే గెలవాలంటే క్యాడర్ ను కలుపుకోవాలని వారికి తెలుసు. అయితే జగన్ ఎమ్మెల్యేలను సంక్షేమ పథకాలు అనే ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు. దీంతో.. ఎమ్మెల్యేలు ఇక క్యాడర్ ను ఏ మాత్రం ఖాతరు చేయనక్కర్లేదని, ఎవరు పార్టీని వీడిపోయినా ఫర్వాలేదనే ధీమాకు వెళ్లారు. అంతకు ముందు ఐదేళ్లూ అనునిత్యం క్యాడర్ తో టచ్లో ఉన్న వారు కూడా, క్యాడర్ నిర్వీర్యం అయిపోతున్నా అసలే మాత్రం పట్టనట్టుగా ఉండిపోయారంటే.. సంక్షేమ పథకాలు, వలంటీర్లు అంటూ జగన్ ఇచ్చిన ధీమా వల్లనే అది జరిగింది!
ఇక సంక్షేమ పథకాలు తీసుకున్న వారిలో.. పెన్షనర్లను పక్కన పెడితే, మిగిలిన ఈ పథకం లబ్ధిదార్లూ జగన్ కు అండగా నిలబడలేదనేది వాస్తవం! 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు, ఇళ్ల లబ్ధిదార్లున్నారు. వారు కాకుండా ఇంకా ఆ నేస్తం, ఈ నేస్తం అంటూ సవాలక్ష మందికి జగన్ డబ్బులిచ్చాడు. ఆ డబ్బులు ఇవ్వడంలో కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఇదంతా నిజమే అయితే, డబ్బులు తీసుకున్నా.. తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు అణుమాత్రం కూడా జగన్ వైపు మొగ్గుచూపలేదు! 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొందిన 40 శాతం ఓటు బ్యాంకులో జగన్ తన పథకాల ద్వారా ఒక్క శాతాన్ని కూడా తన వైపుకు మళ్లించుకోలేకపోయాడు.
అప్పట్లోనే తెలుగుదేశం అభిమానుల్లోని సంక్షేమ పథకాల లబ్ధిదారుల వద్ద జగన్ పథకాల గురించి ప్రస్తావిస్తే.. ఏం జగన్ ఇంట్లోంచి ఇస్తున్నాడా? అనే మాట గట్టిగా వినిపించేది! అలాగే జగన్ పథకాల్లో సవాలక్ష మంది అనర్హులున్నారు. అలాంటి వారికి వెయ్యి, రెండు మూడో వేలో, పదివేలో అయినా.. అల్రెడీ బలిసిన వాళ్లకు అదో లెక్క కాదు కూడా! కాబట్టి.. ఓటు వరకూ వెళ్లే సరికి వారి ప్రయారిటీస్ మారిపోయాయి!
ఇదంతా జరిగిపోయింది, అయితే ఇప్పుడు జగన్ అర్థం చేసుకోవాల్సింది, తను మార్చుకోవాల్సింది, మారాల్సింది ఏమిటంటే.. ఈ సంక్షేమ పథకాల ఊసు ఎత్తకపోవడం ఆయనకే ఇక మంచిది! ఫలితాల రోజున ఇదే మాట్లాడారు. లబ్ధిదారులంతా ఏమైపోయారో అని ఆయన వాపోయారు. ఆ మాట దగ్గరే ఆయన సమీక్షించుకుంటే.. సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చవు! ఇది క్లియర్ అని జగన్ అర్థం చేసుకోవాలి.
గత ఐదేళ్లలో తను అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇక చెప్పుకోవడం కూడా వృథా! పార్టీ నేతల సమావేశంలో కూడా ఆయన మళ్లీ సంక్షేమ పథకాల ఊసు ఎత్తారు! అయితే ఇప్పుడు జగన్ చేయాల్సింది తను ఏం చేసింది, ఎందుకో ఓట్లు వేయలేదు అని నిందించడం కాదు.. చంద్రబాబు హామీలు, వాటిల్లో లోటు పాట్ల గురించి మాట్లాడొచ్చు కానీ ఇక జగన్ తన పథకాల దండకాన్ని చదవడం వల్ల అది నెగిటివ్ ఇంపాక్టే కానీ, పాజిటివ్ ఏ మాత్రం కాదు!
ఇక్కడితో మొదలు పెడితే.. జగన్ తన ప్రసంగాల తీరును మార్చుకోవాల్సిన అవసరం అయితే చాలానే ఉంది! ముందు ఆ పునరక్తులతో కూడిన ప్రసంగాలతో విసుగు తెప్పించడాన్ని జగన్ మానుకోవాలి! ఆయన చుట్టూరా జర్నలిస్టు మేధావులే ఉన్నారు! జీవీడీ కృష్ణమోహన్, సజ్జల వీళ్లంతా జర్నలిస్టులే! జగన్ కు ప్రసంగాల రచయితగా జీవీడీకి పేరు! మరి తెలుగులో అపరమేధావులు అయిన ఈ జర్నలిస్టులకు పునరుక్తి అంటే ఏమిటి, జగన్ ప్రసంగాలు పునరుక్తులతో ఎలా విసుగు తెప్పిస్తాయో తెలిసే ఉండాలి! ముందుగా జగన్ జీవీడీ, సజ్జల లాంటి వాళ్లను ఆమడ దూరం పెడితే ఇలాంటి మార్పులు వస్తాయి కాబోలు!
అయితే .. నమ్మిన వారికి ఎందాకైనా.. అంటూ ఇలాంటి వాళ్లను పట్టుకుంటే చివరకు మిగిలేది ఏమిటో చెప్పనక్కర్లేదు! కార్పొరేట్ పాలిటిక్స్ అన్నా, మరేమనుకున్నా.. జగన్ తన చుట్టూ ఉన్న వాళ్లను ప్రక్షాళన చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అయితే ఉన్నారు. అయితే చుట్టూ ఉన్న వాళ్లది కూడా ఏమీ లేదని, వాళ్ల మాట కూడా జగన్ వినడనే టాక్ కూడా పుట్టించారు చాలా కాలం కిందటే! మరి ఆ టాక్ ను ఎవరు పుట్టించారు అంటే మళ్లీ ఆయన చుట్టూ ఉన్న వాళ్లే అని చెప్పకతప్పదు!
జగన్ ఒకసారి తన తండ్రి రాజకీయ జీవితాన్ని పరికించి చూసుకుంటేనే మంచిది! వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఠీవీని అలవరుచుకోవాలి. నడకను కూడా మార్చుకోవాలి! వైఎస్ ఎలా నడిచేవాడు, ఎలా తలెత్తుకు ఠీవీగా నిలబడేవాడు అనే అంశాలను జగన్ కు అతి దగ్గరగా ఉన్న వారైనా కాస్త గుర్తు చేయాలి! అలాగే జగన్ కు మరో ఉచిత సలహా ఏమిటంటే.. ఒక సారి యాత్ర-2 సినిమాను జగన్ చూసుకోవాలి! అందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన కొడాలి నానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి అపాయింట్ మెంట్ ఇచ్చిన వైనాన్ని, అలా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ ఎలా సమయం ఇచ్చారనే విషయాన్ని చాటారు! మరి తను ముఖ్యమంత్రి హోదాలో తను ఎమ్మెల్యేలను విజయవాడ వైపు కూడా ఎవ్వరూ రావొద్దూ అంటూ ఎందుకు వారించారో జగన్ సమీక్షించుకోవాల్సిన విషయం!
ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తామన్నా వారికి సమయం ఇచ్చి మాట్లాడిన నేత తన తండ్రి అనే విషయాన్ని యాత్ర2 సినిమా చూసినప్పుడైనా జగన్ కు గుర్తొచ్చి ఉండాల్సింది! తను సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలిసేంత తీరిక లేకుండా ఎందుకు గడిపినట్టో జగన్ సమీక్షించోవాలి! జరిగింది జరిగిపోయింది కాబట్టి.. కనీసం ఇప్పుడైనా పార్టీ నేతలకు కాస్త సమయం ఇచ్చి మాట్లాడేంత తీరికను జగన్ చేసుకోవాలి!
తను దేన్నైతే అతిగా నమ్ముకున్నాడో అది దేవుడు, ప్రజలు అయినా సరే.. ఆ నమ్మకాలను కాస్త పక్కన పెట్టి వాస్తవంలోకి వస్తే అది కూడా జగన్ కే మంచిది! నీ ప్రయత్నం లేనిది ఏ దేవుడు కూడా నిన్ను కాపాడడు! ఇది ఐదో తరగతి కుర్రాడికి కూడా చెప్పాల్సిన మాట! జగన్ ఇప్పుడు ఈ తత్వం బోధపడే ఉండాలి. ప్రజలు బిచ్చగాళ్లు కాదు, మీకిదిస్తా అంటే ఓటేయండి అనడానికి ఇది కూడా జగన్ అర్థం చేసుకోవాలి!
జగన్ కు ఇప్పటికీ ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే.. సంప్రదాయ ఓటు బ్యాంకు, కుల ఓటు బ్యాంకు, ఇప్పటికీ అభిమానించే వాళ్లు ఉండటం! ఈ వర్గాలను సముదాయించుకుని, అదనపు ఓట్లను పొందడానికి ఏం చేయాలో కసరత్తు చేయాలి కానీ.. దేవుడ్ని నమ్ముకున్నా, ప్రజల్ని నమ్ముతున్నా అనే ఎమోషన్లు రాజకీయంగా పనికి రావు! రాజకీయాల్లో గెలుపోటములే ఉంటాయి తప్ప పాప పుణ్యాలు కూడా ఉండవని ఓడిపోయాకా పాపాలు, పుణ్యాలు అని మాట్లాడుతున్న జగన్ గ్రహించాలి!
ఉద్యోగాన్వేషణలో ఉన్న ఒక నిరుద్యోగి ఒక ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే, తనెందుకు ఉద్యోగం పొందలేకపోతున్నానో తన గురించి తను సమీక్షించుకుంటాడు! అలా సమీక్షించుకునే వాళ్లే మరో ఇంటర్వ్యూతో అయినా ఉద్యోగం పొందగలరు. పొందు తారు కూడా! అలాంటిది ఇప్పుడు ఎంతో పటిష్టమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన జగన్ తన తీరుతెన్నులను సమీక్షించుకుని.. మార్చుకోవాల్సినవి ఏమిటో తనే తెలుసుకుంటే, నిస్సందేహంగా ప్రత్యామ్నాయ శక్తిగా తన స్థానాన్ని ఎప్పటికీ నిలుపుకుంటాడు!
-జీవన్ రెడ్డి. బి