కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదో ఒకటి చేస్తుందని, చేయాలని ఓటేసిన జనం ఆశపడడంలో తప్పులేదు. కానీ చేయడానికి డబ్బులు కావాలి. ఒకటో తేదీ వస్తోంది. ముందు దానికే పదివేల కోట్లు కావాలి. అందువల్ల ఇప్పటికిప్పుడే ఆరు సూత్రాలు అమలు చేసే అవకాశం తక్కువ. పైగా ఫ్రీ బస్ అమలు చేద్దాం అంటే ఆటో జనాలు ఏం ఫీలవుతారో అన్న అనుమానం వుండనే వుంది. వాళ్లకు జగన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోగా, బస్ లు ఫ్రీ ఇస్తే తెలంగాణలో మాదిరిగా వుంటుంది వ్యవహారం. అందువల్ల బస్ లు ప్రీ ఇచ్చే ముందు ఆటో డ్రైవర్లు మంచి చెడ్డలు కూడా చూడాలి.
సో, అందువల్ల ఇప్పట్లో ఏ మాత్రం ఆర్ధిక భారం వున్న పథకాలు తలకెత్తుకునే అవకాశం లేదు. అన్న క్యాంటీన్లు అంటే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు భరించేలా, వాటి మీద వేస్తారు కనుక ముందుకు వెళ్లిపోయారు. అలాగే చెత్త పన్ను అంటే కార్పొరేషన్, మున్సిపాల్టీలకే కన్నం కనుక అలా నిర్ణయం తీసుకున్నారు. మిగిలినవి అలా చేసే పరిస్థితి లేదు.
అందుకే రకరకాల గ్యాసిప్ లు సోషల్ మీడియాలోకి తీసుకుస్తున్నారు. టీటీడీ ప్రవేశ టికెట్ 300 నుంచి 200 చేస్తారని, లడ్డు ధర 50 నుంచి పాతిక చేస్తారని ఓ గ్యాసిప్. నిజానికి చేసినా చేసేయవచ్చు. ఎందుకంటే కష్టం, నష్టం ప్రభుత్వానికి కాదు.. టీటీడీ కే కదా? కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచి టీటీడీ ఆదాయం అదనంగా కోటి రూపాయలు పెరిగింది అనో గ్యాసిప్. అంటే అంతకు ముందు ప్రభుత్వం తినేసిందా? ఎవరూ తిరుపతి వెళ్లలేదా అనే ప్రచారం జనాల్లోకి వెళ్లాలని.
జనాలు నిజమో, కాదో తెలుసుకునేలోగానే ఈ ఫేక్ న్యూస్ లు వాట్సాప్ ల్లో చలామణీ అయిపోతాయి. అవునట.. అలా అంట.. ఇలా అంట.. అంటూ జనం చెప్పేసుకుంటారు. అదే కావాలి ఈ గ్యాసిప్ రాయళ్లకు. నిజానికి ఇప్పుడున్న ధరల్లో లడ్డు యాభై కి ఇవ్వడమే కష్టం. తగ్గించడం అంటే టీటీడీ ఆదాయానికి గండి కొట్టడమే.
అందువల్ల ఓ నెల వరకు సరైన నిర్ణయాలు, సరైన పథకాల అమలు అన్నది ఊహించడం కష్టం. ప్రభుత్వం ముందు వున్న కీలక బాధ్యత జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు అన్నీ కొనసాగించడం అది మామూలు విషయం కాదు. ఆపైన కొత్త పథకాలు అమలు చేయడం. అదీ అంత వీజీ కాదు.
సో, ప్రభుత్వం మీద గ్యాసిప్ లు మానేసి, నిలదొక్కుకొవడానికి కొంత సమయం ఇవ్వడం అవసరం.