చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరగబోతున్నాయని, అందులో భాగంగా తిరుమల దర్శనాలు, ఇతర సౌకర్యాల విషయంలో కూడా మార్పుచేర్పులు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. తిరుమల కొండపై ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ ధర ప్రస్తుతం 300 రూపాయలుగా ఉంది. దీన్ని 200 రూపాయలకు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల భక్తులకు ఈ కానుక అందించారంటూ పోస్టులు పడుతున్నాయి.
అలాగే లడ్డూ ధరను కూడా భారీగా సవరించినట్టు పుకార్లు చెలరేగాయి. ప్రస్తుతం 50 రూపాయలుగా ఉన్న లడ్డూ ధరను 25 రూపాయలు చేస్తూ జీవో ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. గదుల కేటాయింపు, రుసుముల్లో కూడా భారీగా తగ్గుదల ఉన్నట్టు కథనాలు వచ్చాయి.
అయితే వీటిని టీటీడీ ఖండించింది. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తిరుమలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని విజ్ఞప్తులపై మాత్రమే కొత్త ఈవో సమీక్ష నిర్వహించారని.. స్పెషల్ ఎంట్రీ దర్శనం, లడ్డూ ధరలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు.