చిక్కుల్లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త

రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ కార్నర్ అయ్యాడు. అతడిపై, అతడికి చెందిన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్…

రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ కార్నర్ అయ్యాడు. అతడిపై, అతడికి చెందిన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ నిర్మాణ సంస్థ, తన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు.

రీసెంట్ గా బడే మియా ఛోటే మియా అనే పెద్ద సినిమా నిర్మించింది ఈ సంస్థ. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు వర్క్ చేసిన చాలామంది తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

బాలీవుడ్ లో ఉన్న రూల్స్ ప్రకారం, ఓ సినిమా షూటింగ్ పూర్తయిన 45 రోజుల నుంచి 60 రోజుల్లోపు ఆ సినిమాకు పనిచేసిన వాళ్లందరికీ చెల్లింపులు జరగాలి. కానీ ఇప్పటివరకు తమకు 2 నెలల వేతనాలు అందలేదని, పూజా ఎంటర్ టైన్ మెంట్స్ లో పనిచేసిన ఉద్యోగులు పోస్టులు పెడుతున్నారు.

ఈ ఉదంతం బయటకురావడంతో, సదరు నిర్మాణ సంస్థ తమకు చేసిన అన్యాయాల్ని వివరిస్తూ, మరింతమంది సోషల్ మీడియాకు ఎక్కారు. వైష్ణవి అనే ఉద్యోగి తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది. తనతో పాటు యూనిట్ కు చెందిన 100 మంది సిబ్బంది బకాయిల కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నామని, ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా చేతికి రాలేదని వాపోయింది.

మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటింగ్ కోసం లొకేషన్ కు వెళ్లమని ఆదేశిస్తారని, వెళ్లిన తర్వాత కనీసం తిండి కూడా పెట్టరని ఆరోపించారు. 3 నెలలు పనిచేస్తే, ఒక నెల జీతం ఇచ్చి మిగతాది పెండింగ్ పెడతారని, తన పెండింగ్ ఎమౌంట్ వస్తుందనే ఆశ తనకు లేదని, కనీసం మిగతావాళ్లయినా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ పోస్టు పెడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. హీరోహీరోయిన్లకు ఠంచనుగా పారితోషికాలిచ్చే కొన్ని నిర్మాణ సంస్థలు, సిబ్బంది జీతాలు మాత్రం చెల్లించడానికి ఇష్టపడరని రాశాడు.

1986లో ఏర్పాటైంది పూజా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. కూలీ నంబర్-1, బడే మియా ఛోటేమియా (1998), బీవీ నంబర్-1, ఖామోషీ లాంటి హిట్ సినిమాలు ఈ బ్యానర్ పై వచ్చాయి.