టమాటాకు మళ్లీ టైమ్ వచ్చిందా..?

సరిగ్గా ఏడాది కిందటి సంగతి. ఇదే టైమ్ లో దేశవ్యాప్తంగా టామాట ధర భగ్గుమంది. కిలో 300 రూపాయలకు కూడా చేరుకుంది. అదే టైమ్ లో టమాట పండించిన రైతులంతా లక్షాధికారులయ్యారు. కొంతమంది కోట్లు …

సరిగ్గా ఏడాది కిందటి సంగతి. ఇదే టైమ్ లో దేశవ్యాప్తంగా టామాట ధర భగ్గుమంది. కిలో 300 రూపాయలకు కూడా చేరుకుంది. అదే టైమ్ లో టమాట పండించిన రైతులంతా లక్షాధికారులయ్యారు. కొంతమంది కోట్లు  సంపాదించారు కూడా.

ఇప్పుడు మరోసారి ఆ రోజులు వచ్చినట్టున్నాయి. మార్కెట్లో టమాట ధర మండిపోయింది. ఆల్రెడీ కిలో వంద రూపాయలు దాటేసింది. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో చాలా చోట్ల కిలో వంద రూపాయలకు పైగా అమ్ముడుపోతోంది. దేశంలో ఎండలు ఇలానే కొనసాగితే, కళ్లముందే కిలో 200 రూపాయలకు చేరుకుంటుందని చెబుతున్నారు.

ఆసియాలోనే రెండో అతిపెద్ద టమాట మార్కెట్ గా పేరు తెచ్చుకున్న కోలార్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డుకు దాదాపు 9100 క్వింటాళ్ల టమాటాలు వచ్చాయి. గతేడాది పోలిస్తే ఇది 2000 క్వింటాళ్లు తక్కువ. దేశంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో టమాట దిగుబడి తగ్గినప్పుడు మహారాష్ట్ర నుంచి దిగమతి చేసుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. ఎకరాకు 2000 బాక్సులు వచ్చే టామాట, ఈ ఏడాది 500-600 బాక్సులకు పడిపోయింది.

టామాట ధర తగ్గినప్పుడు ఆ ప్రభావం మిగతా కూరగాయలపై కూడా పడుతుంది. గతేడాది అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే మార్కెట్లో మరోసారి ధరల అసమతుల్యత ఏర్పడుతుంది.