ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల వెదికారు, అయినా కనిపించలేదు. చివరికి తండ్రి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన కూతురు కనిపించడం లేదని రోదించాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ప్రతి గంట ఏం జరిగిందో ఆరా తీశారు. చుట్టుపక్కల వెదికారు. ఫైనల్ గా కంప్లయింట్ ఇచ్చిన కన్న తండ్రే కూతుర్ని హత్య చేసినట్టు గుర్తించారు. అనంతపురం జిల్లాలో జరిగింది ఈ ఘోరం.
నార్పల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గణేశ్ కు 8 ఏళ్ల కిందట అమలతో వివాహమైంది. వాళ్లకు ఆరేళ్ల కూతురు కూడా ఉంది. పాప పేరు పావని. దాదాపు ఏడాదిగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అమలకు అక్రమ సంబంధం ఉందనేది గణేశ్ అనుమానం. పావని కూడా తనకు పుట్టలేదనేది అతడి డౌట్.
ఆ అనుమానం కాస్తా పెనుభూతమైంది. ఎలాగైనా కూతుర్ని వదిలించుకోవాలనుకున్నాడు. గురువారం సాయంత్రం ఆడుకుంటున్న పావనిని తన పొలం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే గొంతు నులిమి చంపేసి, వ్యవసాయ బావిలో పడేశాడు.
నేరుగా ఇంటికొచ్చాడు రాత్రయినా పావని కనిపించకోవడంతో అమల ఆందోళన చెందింది. దీంతో గణేశ్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం వ్యవసాయ బావి దగ్గర గణేశ్ అనుమానాస్పదంగా తిరగడం చూశారు. వెళ్లగా బావిలో పాప మృతదేహం కనిపించింది.
వెంటనే గణేశ్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా జరిగిందంతా పూసగుచ్చినట్టు బయటపెట్టాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పావని అచ్చం తన తండ్రిలానే ఉంటుందని చుట్టుపక్కల వాళ్లు చెబుతుంటారు. కానీ పావని తనకు పుట్టలేదనే అనుమానం గణేశ్ లో రోజురోజుకు పెరిగిపోయింది. ఆ అనుమానమే అతడ్ని హంతకుడ్ని చేసింది.