శాసనసభ కొలువు తీరిన మొదటి రోజున హాజరై ఎమ్మెల్యేలుగా పదవీ ప్రమాణం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ రెండో రోజు సభకు అసలు హాజరు కాలేదు. సభ పట్ల వారికి ఉండే గౌరవం ఇదేనా? అంటూ తెలుగుదేశం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో.. వైసీపీ వారు కూడా ఏం తక్కువ తినలేదు. సభ పట్ల తమ గౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశానికి లేదని, చంద్రబాబునాయుడు కూడా సభకు రాకుండా రెండేళ్లు ఉండిపోయిన వ్యక్తేనని వైసీపీ నేతలు కౌంటర్లు వేశారు. ఈ వాద ప్రతివాదాల సంగతి పక్కన పెడితే.. అసలు వైసీపీ ఎందుకు గైర్హాజరైంది? వారి ఉద్దేశం ఏమిటి? అనేది చర్చనీయాంశంగా ఉంది.
చింతకాయల అయ్యన్నపాత్రుడును సభాపతి స్థానానికి ఎన్నిక కావడం పట్ల జగన్మోహన్ రెడ్డిలో ఒకరకమైన ఆగ్రహం ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని అత్యంత అసభ్యకరమైన భాషలో తిడుతూ వచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు. వినడానికి కూడా సహించలేని పదజాలంతో ఆయన తిట్లు ఉండేవి.
పార్టీ అభ్యర్థులతో విస్తృతస్థాయి సమావేశం పెట్టినప్పుడు కూడా జగన్ ఆ విషయాన్ని ప్రస్తావించారు. ‘జగన్ ఓడిపోయాడు అంతే చచ్చిపోలేదు’ అంటూ తన చావును కోరుకున్న వ్యక్తిని ఇవాళ సభాపతి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అయ్యన్నపాత్రుడిని అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టే కార్యక్రమం ఉన్న రోజున పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్లడానికి ఇష్టపడకపోయినా అర్థం చేసుకోవచ్చు. కానీ.. మిగిలిన వైసీపీ సభ్యులు ఎందుకు వెళ్లలేదు.
సభాపతిని అన్ని పక్షాల వారు వెంట ఉండి.. ఆ పీఠం వరకు తీసుకువెళ్లడం సాంప్రదాయం అనేది నిజమే. కానీ.. జగన్ శనివారం కూడా సభకు హాజరై.. సభాపతిని తీసుకువెళ్లే సమయంలో.. తాను వెంట వెళ్లకుండా.. అలాంటి గౌరవప్రద స్థానానికి తగని వ్యక్తిని ఎంపిక చేసినందుకు తన నిరసనను తెలియజేసి ఉంటే.. చాలా బాగుండేది. ఎందుకు జగన్ వెంట వెళ్ల లేదో ప్రజలు అర్థం చేసుకునేవారు. అది సాంప్రదాయ ఉల్లంఘన కాదని, నిరసన అని తెలుసుకునేవాళ్లు.
జగన్ అసలు సభకే వెళ్లకుండా, పులివెందుల చేరుకున్నారు. ఆయన సరే.. మిగిలిన 10 మంది ఎందుకు సభకు వెళ్లలేదు. జగన్ తన ప్రజలను కలవడానికి పులివెందుల వెళ్లగా, కనీసం ఆ పది మంది కూడా తమ ప్రజలను కలవడానికి నియోజకవర్గాలకు వెళ్లారా? అంటే అది కూడా లేదు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు.. ఈరోజు మాత్రమే సభకు హాజరు కాలేదా? లేదా.. చంద్రబాబు సారథ్యంలో ప్రస్తుతం ఉన్నది కౌరవ సభ అని ప్రకటించేసి.. రాబోయే అయిదేళ్ల పాటు కూడా సభలో అడుగుపెట్టకూడదని తొలిరోజునే నిర్ణయించుకున్నారా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అలా జరిగితే.. వారిని గెలిపించిన ప్రజలు క్షమిస్తారా లేదా అనేది వారే బేరీజు వేసుకోవాలి.