ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికైన సందర్భంగా ఆయనపై అభినందన వెల్లువెత్తింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. నూతన స్పీకర్ గొప్పతనం గురించి వివరించారు. అలాగే అయ్యన్నపాత్రుడిపై మోయలేని భారాన్ని కూడా పవన్‌కల్యాణ్ మోపడం విశేషం. అయ్యన్నపాత్రుడి వాడి, వేడి మాటల గురించి పవన్ వినసొంపైన కామెంట్స్ చేశారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అయ్యన్నపాత్రుడు లాంటి వ్యక్తి స్పీకర్‌గా ఎన్నిక కావడం తనకెంతో ఆనందంగా వుందన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరగడానికి అయ్యన్న అనుభవం ఉపయోగపడుతుందని పవన్‌కల్యాణ్ ప్రశంసించారు.
మీకు కోపం వస్తే రుషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులను పదునైన ఉత్తరాంధ్ర యాసతో గుండు కొట్టేస్తారని పవన్ అన్నారు. అయితే తన బాధల్లా ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవడమే అని పవన్ అనడంతో అయ్యన్నతో పాటు సభికులంతా నవ్వారు. కానీ సభలో ఎవరు తిడుతున్నా దాన్ని అడ్డుకునే బాధ్యత మీ చేతల్లోనే వుందని అయ్యన్నకు పవన్ గుర్తు చేశారు. చిన్నప్పుడు అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్‌ని చేశామని స్కూల్‌డేస్‌ని పవన్ గుర్తు చేశారు.
కానీ మీ వాడి, వేడి పలుకులు, ఘాటైన వాగ్ధాటి చూసి, ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనాన్ని చూస్తారని పవన్ ఆకాంక్షించారు. చర్చల వెనుకాల దాక్కొని సంస్కార హీన భాషల్ని, భావాల్ని రకరకాల మాధ్యమాల్లో విరజిమ్ముతున్నారని, దానిని నియంత్రించడం మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలు కావాలని అయ్యన్నపై పవన్ పెనుభారాన్ని మోపినట్టైంది. సభ్యులెవరైనా సంస్కారహీనమైన భాష మాట్లాడితే అయ్యన్న నియంత్రిస్తారనే నమ్మకాన్ని పవన్ ఉంచారు.
వైసీపీ 11 సీట్లకు పరిమితమైందన్నారు. ఈరోజు వారు సభలో లేరు, వారికి ధైర్యం లేదన్నారు. విజయాన్ని తీసుకోగలిగారు కానీ, ఓటమి తీసుకోలేక ఇక్కడ నుండి వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని పవన్ విమర్శించారు. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదన్నారు, భాష మనుషులను కలపడానికే కానీ విడగొట్టడానికి కాదన్నారు.