చంద్రబాబు ముద్ర గల విధ్వంసం బాట ఇది?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ప్రజా వేదికను కూల్చివేయడంతో పరిపాలన ప్రారంభించారని.. ఈ కారణం చేత ఆయన విధ్వంసక ముఖ్యమంత్రి అంటూ తెలుగుదేశం వారు ఇప్పటిదాకా బురద చల్లుతూనే తమ కాలం గడిపేస్తున్నారు.…

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ప్రజా వేదికను కూల్చివేయడంతో పరిపాలన ప్రారంభించారని.. ఈ కారణం చేత ఆయన విధ్వంసక ముఖ్యమంత్రి అంటూ తెలుగుదేశం వారు ఇప్పటిదాకా బురద చల్లుతూనే తమ కాలం గడిపేస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? తాము కూడా విధ్వంసక మార్గంలోనే నడవాలని వారు నిర్ణయించుకున్నారా? అనే సందేహం కలిగే లాగా.. వారి చర్యలు కనిపిస్తున్నాయి.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని సమూలంగా కూల్చివేయడాన్ని ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని పిల్లర్లు, శ్లాబులు సమస్తంగా కూల్చివేయడం మొదలెట్టారు. 
చంద్రబాబునాయుడు ప్రభుత్వం శాసనసభలో కొలువు తీరిన రెండో రోజునే  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన, నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేయడం విధ్వంసక, పైశాచిక పాలన కాక మరేమిటని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలను లీజు కింద తీసుకున్నారు. ఇలా ప్రభుత్వ స్థలాలను తీసుకోవడం చట్టవ్యతిరేకం కాదు. పద్ధతైన వ్యవహారమే. అప్పట్లో కేబినెట్ ఆమోదంతోనే ఈ స్థలాలను పార్టీ లీజుకు తీసుకుంది. అన్నిచోట్లా వారు పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటున్నారు.

ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. ఈ లీజు కేటాయింపులు, నిర్మాణాలకు అనుమతుల రూపేణా ఏ చిన్న లొసుగు దొరుకుతుందా అని వెతికి మరీ.. ఆ నిర్మాణాలను కూల్చేయడానికి బరితెగిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

తాడేపల్లి వద్ద సీతానగరంలో కూడా నీటిపారుదల శాఖకు చెందిన రెండెకరాల భూమిని వైసీపీ పార్టీ లీజుకుతీసుకుంది. ఈ భవన నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ లేదని, స్థలాన్ని ఇరిగేషన్ శాఖ పార్టీకి స్వాధీనం చేయలేదని సాకులు చూపిస్తూ కూల్చివేతలను ప్రారంభించారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం వైసీపీ విధ్వంసానికి నడుం బిగించిందని, రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాలను కూడా రకరకాల లొసుగులు వెతికి కూల్చివేయడానికి ఇది శ్రీకారం మాత్రమేనని పలువురు అంటున్నారు.