వివేకా హత్య కేసులో సీబీఐకు ఇదేం లాలూచీ!

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన దస్తగిరి ఒక వెరైటీ విజ్ఞప్తితో కోర్టు ఎదుటకు వచ్చాడు. తాను అప్రూవర్ గా మారిపోయాను గనుక.. తనను సాక్షిగా కూడా పరిగణిస్తున్నారు…

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన దస్తగిరి ఒక వెరైటీ విజ్ఞప్తితో కోర్టు ఎదుటకు వచ్చాడు. తాను అప్రూవర్ గా మారిపోయాను గనుక.. తనను సాక్షిగా కూడా పరిగణిస్తున్నారు గనుక.. నిందితుల జాబితా నుంచి తొలగించాలని ఆయన కోర్టును కోరాడు.

కేసులో ఉన్నవాడు తప్పించుకోవడానికి ఎలాంటి కోరిక కోరడమైనా తప్పు కాదు గానీ.. దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా. ఆయనను సాక్షిగా పరిగణించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు నివేదించడమే తమాషా. స్వయంగా హత్యలో పాల్గొన్న నిందితుడితో.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరున్న సీబీఐకు ఇదేం లాలూచీ అంటూ ప్రజలు ఈ పరిణామాలను గమనించి విస్తుపోతున్నారు.

వివేకానందరెడ్డిని హత్య చేయడంలో దస్తగిరి స్వయంగా తాను పాల్గొన్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా సీబీఐ ఎదుట ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అప్రూవర్ గా మారి.. ఈ హత్య వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డిల హస్తం ఉన్నదంటూ వెల్లడించాడు.

ఈ హత్య కేసులో దస్తగిరి నాలుగో నిందితుడు కాగా, అప్రూవర్ గా మారిన తర్వాత సాక్షుల జాబితాలో 110వ వాడిగా ఆయన పేరుంది. సాక్షిగా ఉన్న వాడు నిందితుడగా ఉండకూడదు గనుక.. తనను నిందితుల జాబితా లోంచి తప్పించాలని దస్తగిరి సీబీఐ కోర్టును కోరడమే తాజా విశేషం. దీనికి అభ్యంతరం లేదని సీబీఐ చెప్పడం పెద్ద ట్విస్టు.

ఈ పోకడను అనుమతిస్తే గనుక.. నలుగురితో కలిసి నేరానికి పాల్పడే ప్రతి ఒక్కరూ.. నేరం చేసేసిన తర్వాత ముందే అప్రూవర్ గా మారిపోయి.. మిగిలిన వారి గురించి పోలీసులకు చెప్పేసి నిందితుడిగా తప్పించుకోవడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. ఇది ఒక అసంబద్ధమైన సాంప్రదాయానికి చోటిస్తుందని న్యాయస్థానానికి వివరించారు.

దస్తగిరి విషయంలో తొలి నుంచి సీబీఐ వ్యవహార సరళి సరిగా లేదని ఆ న్యాయవాదులు వాదించారు. దస్తగిరికి ప్రతిసారీ సీబీఐ రెడ్ కార్పెట్ పరుస్తున్నదని ఆరోపించారు. ప్రస్తుతానికి కేసు వాయిదా పడింది గానీ.. ఈ రకమైన పోకడ ఎలా పరిణమిస్తుందనేది పెద్ద చర్చగా మారింది. నేరం చేసిన ప్రతి ఒక్కడూ అప్రూవర్ గా మారిపోయి.. మిగిలిన నేర భాగస్వాముల్ని ఇరికించేయడం అలవాటుగా మారుతుంది కదా అని పలువురు అంటున్నారు. సీబీఐ కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.