మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కొత్త ప్రభుత్వం అగౌరవపరిచిందంటూ “సాక్షి” రాసిన కథనం ఆశ్చర్యం కలిగిస్తోంది. సభలో తగినంత సంఖ్యా బలం లేకపోయినా, తమ యజమానిని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని, ఆ మేరకు గౌరవించాలని సాక్షి మీడియా కోరుకోవడం విడ్డూరంగా వుంది. అసెంబ్లీ కొలువుదీరిన మొదటి రోజే వైఎస్ జగన్‌ను అగౌరవపరిచారంటూ రాయడం ద్వారా… ఇంతకూ ఆ పని చేసిందెవరనే అనుమానం కలుగుతోంది.
ఇలాంటి చౌకబారు కథనాలతో జగన్‌ను తామే అగౌరవపరుచుకుంటున్నామనే ఎరుక ఆ మీడియాకు ఉన్నట్టు లేదు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత జగన్‌ను గుర్తించాలని సాక్షి కోరుకుంటోంది. జగన్‌పై ఆ మీడియాకు ప్రేమ, గౌరవం వుండొచ్చు. దాన్నెవరూ తప్పు పట్టరు. కానీ అసెంబ్లీ సంప్రదాయాలంటూ కొన్ని వుంటాయి కదా? వాటికి అనుగుణంగా ఎవరైనా నడుచుకోవాల్సిందే అని ఆ మీడియాకు ఎందుకు అర్థం కాదో మరి!
శాసనసభ ప్రొటెం స్సీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ముందుగా సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, అనంతరం మంత్రులతో ప్రమాణం చేయించారు. అనంతరం వైఎస్ జగన్‌తో ప్రమాణం చేయించారు. వైసీపీకి 11 సీట్ల బలం వుంది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈ విషయాన్ని స్వయంగా జగనే తన పార్టీ నేతల సమావేశంలో కూడా చెప్పారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ కొలువుదీరిన మొదటి రోజే జగన్‌ను అవమానించారంటూ వైసీపీ అధికార పత్రిక రాయడం గమనార్హం. గతంలో జగన్ ప్రభుత్వం ఇలా చేయలేదని ఆ కథనంలో రాసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేసిన తర్వాత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడితో ప్రమాణం చేయించి, చాలా గొప్ప విలువల్ని పాటించారని ఆ పత్రిక పేర్కొంది. టీడీపీకి నాడు 23 మంది సంఖ్యా బలం వుంది. అందువల్లే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. ఆ కారణంగానే ఆయన్ను గౌరవించారే తప్ప, చంద్రబాబుపై ప్రత్యేక ప్రేమతో కాదని అందరికీ తెలుసు.
ప్రజావ్యతిరేకత కారణంగా వైసీపీ ఘోర పరాజయంపాలైంది. జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. సీట్లు తక్కువ వుండొచ్చు కానీ, 40 శాతం ఓట్లతో అత్యంత బలమైన పార్టీ అని, జగన్‌కు గౌరవం ఇవ్వాలని అసహ్యం కలిగించే రాతలు రాయడం ద్వారా… ఎవరు ఎవరిని అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. నిజానికి మంత్రుల తర్వాత కూడా జగన్‌తో ప్రమాణం చేయించాల్సిన అవసరం లేదని, కానీ ఆయన నిన్నమొన్నటి వరకూ సీఎంగా పని చేశారని, ఆ గౌరవంతోనే ముందుగా జగన్‌ను ఆహ్వానించినట్టు కొత్త ప్రభుత్వం చెబుతోంది.
కావున వైసీపీ సభా సంప్రదాయాలకు ఎంత మేరకు గౌరవం ఇచ్చిందో ప్రజలంతా చూసిన తర్వాతే, ఈ తీర్పు ఇచ్చారని ఇప్పటికైనా సాక్షి తెలుసుకోవడం మంచిది. అనవసరంగా లేనివి ఆపాదించి, ఇంకా జగన్‌పై భక్తితో లేనిపోని కథనాలు రాయడం ద్వారా, ఆయన్ను మరింత చులకన చేయడమే అవుతుంది. ఆ వాస్తవాన్ని గమనంలో పెట్టకుని కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం వుంది. ఇప్పటికే ఆరు నెలల నుంచి ఏడాది సమయాన్ని చంద్రబాబు సర్కార్‌కు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీ అధికార మీడియాగా … తాను కూడా ఓపిక వహించి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కలమెత్తితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.