ముద్రగడ బేల పలుకుల అంతరార్థం ఏమిటో?

ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్ ను నిందించడంలో ఆశ్చర్యం లేదు. పిఠాపురంలో పవన్ కు ప్రధాన ప్రత్యర్థి తానే అయినట్టుగా ముద్రగడ అప్పట్లో రెచ్చిపోయారు. సవాలుకు కట్టుబడి పేరు కూడా మార్చుకున్నారు. ట్రోలింగ్ కు…

ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్ ను నిందించడంలో ఆశ్చర్యం లేదు. పిఠాపురంలో పవన్ కు ప్రధాన ప్రత్యర్థి తానే అయినట్టుగా ముద్రగడ అప్పట్లో రెచ్చిపోయారు. సవాలుకు కట్టుబడి పేరు కూడా మార్చుకున్నారు. ట్రోలింగ్ కు గురవుతున్నారు. కాబట్టి పవన్ ను తిడుతుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. ఆయన విడుదల చేసిన వీడియోలో.. ‘మేం అనాధలం సార్.. మాకు ఎవరూ లేరు సార్..’ అంటూ చెప్పిన మాటలే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

సరిగ్గా ఎన్నికలకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఈ కాపు నాయకుడు- ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయాడు గనుక.. ఆయన పార్టీ నుంచి దూరం జరిగినట్టేనా? అనే అభిప్రాయాలు పలువురిలో కలుగుతున్నాయి.

పేరు మార్చుకున్నందుకు గాను ముద్రగడను తిడుతూ అనేక మంది మెసేజీలు పెడుతున్నారట. అవన్నీ పవన్ కల్యాణ్ అభిమానులే పెడుతున్నారనేది ఆయన ఆరోపణ. ఇలా బూతులు తిట్టించే బదులు, మా కుటుంబంలోని ఏడుగురినీ ఒకేసారి చంపేయండి.. అంటూ ఆయన రెచ్చిపోయారు. అంతవరకు ఆవేశం ఓకే- కానీ.. చంపినా ఎవరూ అడగరు.. ‘మాకు ఎవరూ లేరు సార్.. మేం అనాథలం సార్’ అంటూ సన్నాయి నొక్కులే అర్థం కావడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమకు అండగా నిలబడే పరిస్థితి లేదని ఆయన ఈ మాటల ద్వారా సంకేతాలు ఇవ్వదలచుకున్నారా? అని పలువురిలో సందేహం కలుగుతోంది.

ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అనే ముద్రతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తానని, జగన్ తనకు ఏ పదవి ఇస్తే అది తీసుకుంటానని ఆ సందర్భంలో ముద్రగడ చెప్పారు. కాపుల కోసం చాలా పోరాటాలు చేసినట్టు ముద్ర ఉన్న ముద్రగడ వలన ప్రయోజనం ఉంటుందని, జగన్ కూడా ఆశించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా కాపు ఓట్లను ప్రభావితం చేయడం కాదు కదా.. తన సొంత ఊరు, సొంత ప్రాంతంలో కూడా ఆ బలం ముద్రగడకు లేదని ఎన్నికలు తేల్చేశాయి.

జగన్ ఓడిపోయిన తర్వాత.. ఆయన ద్వారా తనకు దక్కే రాజకీయ పదవులు కూడా ఉండబోవనే క్లారిటీ వచ్చిందేమో గానీ.. ముద్రగడ ఇప్పుడు ‘మేం అనాథలం’ అనే బేల పలుకులు పలుకుతున్నారని ప్రజలు విశ్లేషిస్తున్నారు.

ఇంతటి సీనియర్ నాయకుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి, నాయకుడికి అండగా ఉండాల్సింది పోయి.. ముందే పలాయనం చిత్తగిస్తున్నట్టు గా ఈ వైఖరి ఉన్నదని అంటున్నారు. వైసీపీ గౌరవం పరంగా ఆయనకు చేసిన నష్టం ఏమీ లేకపోయినా, ఆ పార్టీని ఆయనే వదిలించుకోవాలనుకున్నట్టుగా ఈ వ్యాఖ్యలున్నాయని వినిపిస్తోంది.