జగన్ ఫార్ములానే ఫాలో అయిన బాబు

రాజకీయాల్లో చంద్రబాబు కంటే అనుభవంలో తక్కువ అయినా జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో బాగానే మార్కులు కొట్టేశారు. ఆయన తొలిసారి 2019లో సీఎం అయిన తరువాత ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన హోం…

రాజకీయాల్లో చంద్రబాబు కంటే అనుభవంలో తక్కువ అయినా జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో బాగానే మార్కులు కొట్టేశారు. ఆయన తొలిసారి 2019లో సీఎం అయిన తరువాత ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన హోం మంత్రి పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు.

రెండు సార్లు జగన్ మంత్రివర్గం విస్తరించినా ఇద్దరు ఎస్సీ మహిళలకే హోం మంత్రి పదవిని ఇచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. స్పీకర్ పోస్టు విషయంలో ఆయన ఉత్తరాంధ్రకు ప్రాముఖ్యత ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేత తమ్మినేని సీతారాంకి ఆ పదవి వరించింది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అనుసరించారు అని అంటున్నారు.

పైగా హోం మంత్రి స్పీకర్ పోస్టులను ఉత్తరాంధ్రకే కేటాయించారు. ఉమ్మడి విశాఖకే ఆ పదవులు దక్కాయి. ఈ విధంగా బాబు జగన్ ఫార్ములానే అనుసరించారు అని అంటున్నారు. అయితే టీడీపీ ఇక్కడ చేసిన మార్పు చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్పీకర్లు ఎవరూ ఇప్పటిదాకా లేరు. అలాగే హోం మంత్రి చేసిన వారు కూడా లేరు. అదే శ్రీకాకుళం నుంచి స్పీకర్లు గా చేసిన వారు ఉన్నారు. సీనియర్ నేత కిమిడి కళా  వెంకట్రావు హోం మంత్రిగా కొన్నాళ్ళు చేశారు.

దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాకే ఈ కీలక పదవులు ఇచ్చి బాబు తన మార్క్ అలా చాటారు అని అంటున్నారు. విశాఖ జిల్లాకు ఎక్కువ ప్రాముఖ్యతను రాజకీయంగా రాజ్యాంగ పరంగా కూడా ఇవ్వడం జరిగింది. పదవుల విషయంలో సమతూకం పాటించినట్లు అయింది.

శ్రీకాకుళం జిల్లాకు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి పదవులు దక్కితే విజయనగరానికి రెండు రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయి. విశాఖ జిల్లాకు ఒక మంత్రి పదవితో పాటు స్పీకర్ దక్కింది. పైగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని విశాఖ సిటీకి కేటాయించారు. ఈ విధంగా బీసీల ఖిల్లాగా పేరున్న ఉత్తరాంధ్రలో టీడీపీ తనదైన శైలిలో సామాజిక రాజకీయ కూర్పుని చేసినట్లు అయింది అంటున్నారు.