నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యారు. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం నుంచి తాజాగా గెలిచారు.
అయ్యన్నది సుదీర్ఘ రాజకీయ జీవితం. 1983లో ఎన్టీఆర్ అనూహ్యంగా ఆయనకు టికెట్ ఇచ్చారు. అప్పటికి అయ్యన్న వయసు పాతికేళ్ళు. ఎన్టీఆర్ నర్శీపట్నంలో అప్పటికి కీలక నేతగా ఉన్న అయ్యన్న తాత లచ్చాపాత్రుడు కోసం కబురు పంపితే ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ సంగతి కబురుగా మోసుకెళ్ళి ఎన్టీఆర్ కంట్లో అయ్యన్న పడడంతో ఆయననే పోటీకి పెట్టారు.
అలా తొలిసారి ఎమ్మెల్యే అయిన అయ్యన్న 1985లో మంత్రి అయ్యారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లలో గెలిచిన అయ్యన్న ఇప్పటికి ఏడు సార్లు నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన రికార్డును సాధించారు.
ఈసారి ఎన్నికలే తనకు చివరివి అని ఆయన చెప్పుకున్నారు. గెలిచి మంత్రి కావాలని ఆయన ఆశించారు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు అయ్యన్న విషయంలో మాత్రం వేరేగా ఆలోచించారు. ఆ విధంగా స్పీకర్ పదవి ఆయనకు దక్కింది.
అయితే స్పీకర్ పదవి తనకు లభించడం ఆనందకరం అని అయ్యన్న అన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పలు సార్లు మంత్రిగా పనిచేసిన తనకు ఈ పదవి ఒక గౌరవం అని అయ్యన్న అంటున్నారు. తాను స్పీకర్ చెయిర్ లో కూర్చున్నాక పార్టీలు గుర్తుండవని ఆయన స్పష్టం చేశారు.
విపక్ష సభ్యులకు కూడా అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని అయ్యన్న చెప్పారు. వారికి కూడా అధికార పక్షంతో సమానంగా మాట్లాడేందుకు చాన్స్ ఇస్తామని అన్నారు. తన పనితీరు ఎలా ఉంటుందో మీరే చూస్తారు అని మీడియాను ఊరించారు అయ్యన్న. స్పీకర్ అంటే మాట్లాడేవారు కాదు మాట్లాడించేవారు. ఈ కొత్త పదవిలో అయ్యన్న ఎలా రాణిస్తారు అన్నది చూడాల్సిందే అంటున్నారు.