ప్రభుత్వాలు మారినప్పుడు ప్రధాన కార్యదర్శిని, పోలీసు బాస్ ను మార్చడం అనేది చాలా సాధారణంగా జరిగే వ్యవహారం. ప్రతి పార్టీ నాయకుడు కూడా తమకు అనుకూలంగా ఉండే వాళ్లే.. రాష్ట్ర అధికార యంత్రాంగానికి పెద్దదిక్కుగా ఉండాలని కోరుకుంటారు.
అలాగే తెలుగుదేశం గెలిచిన తర్వాత.. అధికారం చేపట్టడానికంటె ముందే.. చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని పక్కకు తప్పించి, తనకు కావాల్సిన నీరభ్ కుమార్ ప్రసాద్ ను అక్కడ వేయించుకున్నారు చంద్రబాబు. అలాగే ఇప్పుడు కొత్త డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమల రావును నియమించారు.
ఎన్నికల నాటికి డీజీపీగా కె.రాజేంద్రనాధ్ రెడ్డి ఉండగా.. తెలుగుదేశం నాయకులు పదేపదే పితూరీలు చేసి.. మొత్తానికి ఆయనను పక్కకు తప్పించారు. ఆ స్థానంలో ఈసీ హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఇప్పుడు చంద్రబాబు ఆయనను పక్కకు తప్పించి.. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమల రావును ఆ పోస్టులోకి తీసుకువచ్చింది.
ఈ నియామకం విషయంలో చంద్రబాబు నాయుడు, గతంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వ్యూహాన్నే పాటించినట్లుగా కనిపిస్తోంది. తాను పారదర్శకంగా కనిపించడానికి ఈ ఎత్తుగడ వేశారా? అని కూడా ప్రజలు అనుకుంటున్నారు.
2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర డీజీపీగా దామోదర గౌతం సవాంగ్ ను నియమించారు. ఆయన జగన్ సామాజిక వర్గానికి చెందిన వారు కాదు. తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఆ తర్వాతి రకరకాల పరిణామాల్లో సవాంగ్ ను ఏపీపీఎస్సీకి పంపి, రాజేంద్రనాధ్ రెడ్డిని డీజీపీ చేయడం జరిగింది. కానీ తన ప్రభుత్వ హయాంలో మొదటి డీజీపీ ఎంపికలో తన కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదు.
చంద్రబాబునాయుడు విధానం అది కాదు. ఆయన 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కమ్మ కులానికే చెందిన జెవి రాముడును మొదటి డీజీపీగా ఎంచుకున్నారు. 2024లో మాత్రం.. బీసీ కురబ వర్గానికి చెందిన ద్వారకా తిరుమల రావును డీజీపీ చేశారు. ఆయన భార్య కాపు వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఆయన నియామకంతో తెలుగుదేశానికి ప్రస్తుతం బలంగా ఉన్న ఆ వర్గాన్ని కూడా సంతృప్తి పరచినట్లు అయింది. పైగా మొదటి డీజీపీ విషయంలో తన సొంత కులం చూసుకోలేదని డప్పు కొట్టుకునే చాన్సు దక్కింది. అప్పట్లో జగన్ చేసిన పద్ధతిలోనే ఇప్పుడు చంద్రబాబు చేశారని ప్రజలు అనుకుంటున్నారు.