ఆ మీడియా నీతులు.. ఎదుటివారికే!

ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు త‌మ‌ని తాము విశ్వ‌స‌నీయ‌త‌కి మారుపేరుగా భావిస్తూ వుంటాయి. అయితే వీటికి విశ్వ‌స‌నీయ‌త కంటే టీడీపీ విశ్వాసం ఎక్కువ‌. నిష్ప‌క్ష‌పాతం, నీతులు ఎదుటివారికి మాత్ర‌మే చెబుతాయి, తాము పాటించ‌వు. Advertisement జ‌గ‌న్ ఓడిపోవ‌డానికి…

ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు త‌మ‌ని తాము విశ్వ‌స‌నీయ‌త‌కి మారుపేరుగా భావిస్తూ వుంటాయి. అయితే వీటికి విశ్వ‌స‌నీయ‌త కంటే టీడీపీ విశ్వాసం ఎక్కువ‌. నిష్ప‌క్ష‌పాతం, నీతులు ఎదుటివారికి మాత్ర‌మే చెబుతాయి, తాము పాటించ‌వు.

జ‌గ‌న్ ఓడిపోవ‌డానికి జ‌గ‌న్ ఎంత కార‌ణ‌మో, ఈ రెండు ప‌త్రిక‌లు అంతే కార‌ణం. త‌న‌ని తాను చ‌క్ర‌వ‌ర్తిగా భావించుకుంటూ, ప్ర‌తినిధుల‌తో పాల‌న సాగించాడు. ఇంటి నుంచి బ‌య‌టికి రాని జ‌గ‌న్‌ని, జ‌నం ఇంటికే ప‌రిమితం చేసారు. ప్ర‌జ‌ల విజ‌యం ఇది.

ప‌త్రికా విలువ‌ల గురించి, ట‌న్నులకొద్ది ఉప‌న్యాసాలు ఇచ్చే ఈ రెండు ప‌త్రిక‌ల్ని గురువారం ఒక‌సారి పరిశీలిస్తే ….

తాడిప‌త్రిలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వీడియోల సాక్షిగా అధికారుల్ని న‌రుకుతా, చంపుతా , కొడ‌క‌ల్లారా అంటూ ఒక మ‌హిళా అధికారిని ఇంట్లో కులుకుతోంది అన్నారు. ఆంధ్ర‌జ్యోతి, ఈనాడుల్లో ఈ వార్త ఒక సింగిల్ కాల‌మ్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. అది కూడా జేసీ బాధ‌, ఆవేద‌న అంటూ…!

ఇదే మాట‌లు , బెదిరింపులు వైసీపీ నాయ‌కులు చేసి వుంటే రెండూ ఫ‌స్ట్ పేజీల్లో విరుచుకుప‌డేవి. అహంకారం, కండ‌కావ‌రం అంటూ ప్రాస హెడ్డింగ్‌లు పెట్టి అధికారుల హ‌క్కుల్ని కాపాడేవి.

వైసీపీ అనుకూలంగా ఒక్క వాక్యం రాసినా వాళ్ల‌ని కూలి మీడియా అని ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ ముద్దుగా పిలుస్తుంటాడు. తెలుగు జ‌ర్న‌లిస్టుల‌కి నాసిర‌కం జీతాలిచ్చి బ‌త‌క‌లేనిత‌నం క‌ల్పించిన ప్ర‌ముఖుల్లో ఆర్కే ఒక‌రు. కూటికి గ‌తి లేని జ‌ర్న‌లిస్టులు కూలి కోసం ప‌ని చేస్తే అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి య‌జ‌మానులు కూలి కోసం ప‌నిచేస్తే ఏమ‌నాలి?

ట్రాఫిక్ నిర్వ‌హించ‌లేని కార‌ణంతో డీజీపీని మార్పు చేశారు. ఇది రెండో వార్త‌. డీజీపీని మార్చుకోవ‌డం ప్ర‌భుత్వ ఇష్టం. ఎవ‌రూ కాద‌న‌లేరు. ఆంధ్ర‌జ్యోతి కార‌ణం ఎంత సిల్లీగా వుందంటే బాబు ప్ర‌మాణ స్వీకారంలో డీజీపీ ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ విఫ‌ల‌మ‌ట‌!

ఇదే జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగితే ట్రాఫిక్‌కి డీజీపీకి ముడి, జ‌గ‌న్ త‌ల‌తిక్క ప‌నుల‌ని పెద్ద వార్త వ‌చ్చేది.

ఇక ష‌ర్మిల ప్రెస్‌మీట్ కూడా క‌రివేపాకు వార్త‌గా మారింది. ఎన్నిక‌ల వ‌ర‌కు ఆమె స్పేస్ క‌నీసం డ‌బుల్ కాల‌మ్ లేదా ఫస్ట్ పేజీ. ఇప్పుడు ఒక మూల సింగిల్ కాల‌మ్‌. ఇక‌మీద‌ట అదీ వుండ‌దు.

వాళ్ల పేప‌ర్, వాళ్ల ఇష్టం. ఏం రాసుకున్నా అభ్యంత‌రం లేదు. కానీ ప‌త్రికా విలువ‌ల పేరుతో సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లా ఉప‌న్యాసాలు, ఉప‌దేశాలు ఎత్తుకుంటారే! అదీ అస‌లు స‌మ‌స్య‌.