మా హ‌యాంలోని ఆ నిర్మాణాల్ని కూడా చూపండి

విశాఖ రిషికొండ‌లో అత్యాధునిక క‌ట్టడాల‌పై తీవ్ర ర‌చ్చ సాగుతోంది. ప‌ర్యాట‌క‌శాఖ ఆధ్వ‌ర్యంలో రిషికొండ‌లో ఆ నిర్మాణాల్ని చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌క‌శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ విమ‌ర్శ‌ల‌పై తీవ్ర‌వంగా స్పందించారు. ఆ…

విశాఖ రిషికొండ‌లో అత్యాధునిక క‌ట్టడాల‌పై తీవ్ర ర‌చ్చ సాగుతోంది. ప‌ర్యాట‌క‌శాఖ ఆధ్వ‌ర్యంలో రిషికొండ‌లో ఆ నిర్మాణాల్ని చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌క‌శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ విమ‌ర్శ‌ల‌పై తీవ్ర‌వంగా స్పందించారు. ఆ భ‌వనాలు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంతింటివి అన్న‌ట్టు ప్ర‌చారం చేస్తున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. అవి ప్ర‌భుత్వాలు భ‌వ‌నాల‌ని ఆమె చెప్పుకొచ్చారు.

రిషికొండ భ‌వ‌నాల‌ను అడ్డు పెట్టుకుని త‌మ‌పై బుర‌ద చ‌ల్ల‌డానికి టీడీపీ నేత‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగంగా ఆ భ‌వ‌నాల‌ను నిర్మించార‌న్నారు. తామేమీ వ‌ర్షానికి కారిపోయే అసెంబ్లీ, స‌చివాల‌య భ‌వ‌నాల‌ను నిర్మించ‌లేద‌ని టీడీపీ నేత‌ల్ని రోజా దెప్పి పొడిచారు. సెవెన్‌స్టార్ రేంజ్‌లో ప‌ర్యాట‌క భ‌వ‌నాల‌ను నిర్మించామ‌న్నారు.

రిషికొండ‌లో నాణ్య‌మైన, అంత‌ర్జాతీయ స్థాయిలో క‌ట్ట‌డాలు చేప‌ట్టిన‌ట్టు మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. గ‌తంలో చంద్ర‌బాబు ఎక్క‌డైనా ఇలా నాణ్య‌మైన భ‌వ‌నాలు నిర్మించారా? అని నిల‌దీశారు. అంతేకాదు, ఈ భ‌వ‌నాల నిర్మాణాల‌కు అడుగ‌డుగునా టీడీపీ నేత‌లు అడ్డు త‌గిలార‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తి, అలాగే హైకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్మాణాలు పూర్తి చేశామ‌న్నారు.

రిషికొండ క‌ట్ట‌డాల‌ను చూపిన‌ట్టుగానే, త‌మ హ‌యాంలో నిర్మించిన వైద్య క‌ళాశాల‌లు, నాడు-నేడు స్కూల్స్‌, ఆస్ప‌త్రులు, స‌చివాల‌యాలు, పోర్ట్‌ల‌ను కూడా చూపాల‌ని టీడీపీ నేత‌ల్ని రోజా కోరారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై టీడీపీ దాడులు ఆపి, హామీల అమ‌లుపై దృష్టి పెట్టాల‌ని ఆమె సూచించారు.