సినిమా నిడివి రెండున్నర గంటలు. ఈ లోగా విలన్‌ని కొట్టి దారికి తేవచ్చు. హీరోయిజం చూపించుకోవచ్చు. రాజకీయం నిడివి ఐదేళ్లు. ఇక్కడ విలన్లు కనపడరు. హీరోలే విలన్లు అవుతారు. విలన్లే హీరోలవుతారు.
పవన్‌కల్యాణ్ సినిమాల్లో హీరోనే. అయితే రాజకీయాల్లో హీరోనా, కాదా అని నిరూపించుకోవాలి. గత పదేళ్లుగా ఆయన ఒక ఓడిపోయిన పార్టీ అధ్యక్షుడు మాత్రమే. ఇప్పుడు విజేత, ఉప ముఖ్యమంత్రి. కీలక శాఖలు చేతికింద ఉన్నాయి. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు ఆయన మాటకు విలువ వుంది. పలుకుబడి వుంది. గతంలో ఆయన ప్రజలకి అది చేస్తాం, ఇది చేస్తాం అని చాలా మాట్లాడారు. అప్పుడు వాటికి విలువ లేదు. ప్రపంచం గెలిచే వాడి మాటే వింటుంది. ఇప్పుడు ఆయనేం మాట్లాడినా శాసనం. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది అంటే చెల్లదు.
చంద్రబాబు రాజకీయాన్ని జనం చాలా సార్లు చూశారు. జగన్‌ను వద్దూ అనుకోవడమే ఈ సారి జనం ఎజెండా తప్ప, బాబు కావాలనే గాఢత లేదు. కానీ అనివార్యం. ప్రత్యామ్నాయం లేదు. అయితే పవన్‌కల్యాణ్ రాజకీయాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఆయన ముందు రెండు దారులున్నాయి. ఒకటి బాబు నీడలో ఎదగకుండా అలాగే వుండిపోవడమా? ఘర్షణ లేకుండానే లౌక్యంగా తాను ఎదుగుతూ పార్టీని ఎదగనివ్వడమా?
బాబు నీడలా వుంటే తొందరగానే జనానికి మొహమొత్తుతుంది. ఎందుకంటే ఆయన్ని పొలిటికల్‌గా కాకుండా హీరోగా చూసే అభిమానులే ఎక్కువ కాబట్టి. మరి ఆయన తన ముద్రని పాలనపై వేయాలంటే ఏం చేయాలి? రాజకీయాల్లో హీరో కావాలంటే ఏం జరగాలి?
ఇదంత సులభం కాదు. రాజకీయాల్లో ఆశయం వుంటే చాలదు, ఆచరణ అవసరం. అయితే జనానికి మేలు చేసే ఏ నాయకున్ని అధికారులు క్షమించరు. పార్టీలు మారుతాయి, మంత్రులు మారుతారు కానీ, బ్యూరోక్రసీ మారదు. వాళ్ల బ్లడ్ గ్రూప్ సేమ్. ఏదో ఒక సాకు చెప్పి అడ్డు తగుల్తారు. వీళ్లకి అదనంగా భజన బృందం చేరుతుంది. సినిమాల్లో ఆయనకి భజన కొత్త కాదు కానీ, అయితే అక్కడ చిడతలు, డోలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఏమారితే డొక్క చించి డోలు కడ్తారు. ఈ బాలారిష్టాలు దాటుకుని ముందుకు పోవాలంటే చిత్తశుద్ధి వుండాలి. గతంలోలా కామన్ మ్యాన్ ఫోర్స్ అని మాటలు చెబితే లాభం లేదు. కామన్ మ్యాన్ అనుకోవడం వల్లే పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, అతను నమ్మకపోవడం వల్లే గతంలో ఓడిపోయాడు.
వకీల్‌సాబ్ సినిమాలో ఆయన అమ్మాయిల ఆత్మ గౌరవం గురించి పోరాడే లాయర్. ఇప్పుడు ఆయన చెబితే చట్టమే పని చేస్తుంది. గతంలో 30 వేల మంది అమ్మాయిల అక్రమ రవాణా గురించి ఒక ఆరోపణ చేశారు. ఇపుడు అన్ని దర్యాప్తు సంస్థలు ఆయన మాట వింటాయి. వేల మంది కాకపోయినా, వందల మంది అమ్మాయిలను కాపాడినా ఆయన్ని రియల్ హీరో అంటారు.
అటవీశాఖ ఆయన పరిధిలోనే వుంది. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నుంచి పుష్పలు పుట్టుకొచ్చి ఎర్రచందనాన్ని దోచేస్తారు. పవన్ నిజంగా అనుకుంటే ఎర్రచందనం దొంగల్ని లేకుండా చేయొచ్చు. చేయగలడా?
గ్రామాల సమస్యలు తెలియాలంటే , అక్కడ తిరగాలి, ఒక రోజైనా వుండాలి. అమరావతిలో వుంటే అణగారిన ప్రజలు అర్థంకారు.
గతంలో గంజాయి గురించి పవన్ మాట్లాడాడు. ఇపుడు గంజాయి అనే పదమే రాష్ట్రంలో వినపడకుండా చేయొచ్చు. వ్యవస్థల్లో ఉన్న అవినీతి గంజాయి కంటే ప్రమాదం. దాన్ని అదుపు చేస్తే గంజాయి కంట్రోల్ అవుతుంది.
అధికారంలో వచ్చే మత్తు, ఏ డ్రగ్స్ నుంచి కూడా రాదు. దానికి అలవాటైతే చుట్టూ పోలీసులు, భజన బృందాలు, తప్పుదారి పట్టించే అధికారులు మాత్రమే కనిపిస్తారు. ప్రజలు కనపడరు.
వాళ్లు మీకు ఓటు వేసింది మీరు సినిమా హీరో అని కాదు. రాజకీయాల్లో మిమ్మల్ని హీరోగా చూడాలని. ఆప్షన్ మీ చేతిలోనే వుంది.