తెలుగు దర్శకులు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడం దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవహారం. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో దర్శకుడు చేరాడు. అతడే గోపీచంద్ మలినేని. తెలుగులో క్రాక్, వీరసింహారెడ్డి లాంటి హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు, తొలిసారి బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు.
సన్నీ డియోల్ హీరోగా ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా హిందీలో నిర్మించబోతున్నాయి.
4 దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొనసాగుతున్నాడు సన్నీ డియోల్. గతేడాది గదర్-2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.
ఈరోజు ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టారు. 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. సయామీ ఖేర్, రెజీనాను 2 కీలక పాత్రల కోసం తీసుకున్నారు. త్వరలోనే సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.