మాజీ మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్ అంటే చాలు… చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌పై ఇష్టమొచ్చినట్టు చెలరేగిపోవడం చూశాం. ఇదంతా వైసీపీ అధికారం ఉన్నప్పుడు సాగింది. అధికారం పోవడంతో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టకున్నారు. గతంలో మాదిరిగా బాబు, లోకేశ్‌లపై అవాకులు చెవాకులు పేలలేదు. చంద్రబాబునాయుడనో, ఆయన అంటూ నాని సంబోధించడం విశేషం.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబు, పవన్, లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై కొడాలి నానితో పాటు కొందరు ముఖ్య నాయకులు నోరు పారేసుకోవడం రాజకీయంగా వ్యతిరేకత వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
కోట్లాది మంది మనకు ఓట్లు వేశారని, వాళ్లందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత వుందని జగన్ చెప్పారన్నారు. తెలుగుదేశం దాడిలో గాయపడ్డ ప్రతి ఒక్కర్నీ తాను పరామర్శిస్తానని జగన్ చెప్పినట్టు నాని తెలిపారు. ఆరునెలల పాటు చంద్రబాబు పాలనను చూస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు మొదలుకుని మహిళందరికీ నెలకు రూ.1500, అలాగే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, వాటి గురించి చంద్రబాబునాయుడు మాట్లాడ్డం లేదన్నారు. అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాడని, దాని గురించి కూడా మాట్లాడ్డం లేదన్నారు.
50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారని, అది ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి ఆయన మాట్లాడ్డం లేదన్నారు.
హామీల్ని పక్కదారి పట్టించడానికి సోమవారం పోలవరం, తాజాగా రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటించారన్నారు. హామీల అమలు ఎప్పుడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ నేతల టార్గెట్ విషయమై కొడాలి నాని సీరియస్‌గా స్పందించారు. జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. అలాగే రిషికొండలో భవనాల నిన్మాణంపై టీడీపీ, ఎల్లో మీడియా సిగ్గుఎగ్గు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. రిషికొండలో కట్టించిన భవనాల్లో జగన్ నివాసం వుంటారని ఈ వెధవలకి ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. రూ.400 కోట్లతో జగన్ ఏడు భవనాలు కట్టుకున్నాడని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.