ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళ్తాడని, వెళ్లడని రెండు రకాల అభిప్రాయలు వినిపిస్తున్నాయి. తాజాగా తాడేపల్లిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలపై జగన్ కామెంట్స్ వింటే, ఆయన వెళ్లకూడదనే అభిప్రాయంలో ఉన్నారని అర్థమవుతోంది.
జగన్ ఏమన్నారంటే… “మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే. అసెంబ్లీలో మనం చేసేది తక్కువే. స్పీకర్ పదవికి ఎంపికైన వ్యక్తి మాట్లాడిన మాటలు మనం సోషల్ మీడియాలో వింటున్నాం. జగన్ ఓడిపోయాడు, ఏకంగా చనిపోలేదు అని ఒకడంటాడు. చచ్చేదాకా కొట్టాలని ఇంకొకడు అంటాడు. ఇలాంటి కౌరవులు వుండే సభకు వెళ్లాల్సి వుంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనే నమ్మకం లేదు. పాపాలు పండేకొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయి”
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదని జగన్ నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది. పైగా ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో అసెంబ్లీలో మూలన విసిరేసినట్టు వైసీపీకి చెందిన 11 మంది సభ్యులకు సీట్లు కేటాయిస్తారు. మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించరనేది వాస్తవం. అందుకే మరోసారి ప్రజల్లో విస్తృతంగా తిరగాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు.
అయితే కొంత సమయం ఇచ్చి, హామీలను అమలు చేయకపోతే ఉధృతంగా ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని జగన్ డిసైడ్ అయ్యారని ఆయన మాటలు వింటే అర్థమవుతుంది.