టీడీపీ సూపర్ సిక్స్ పథకాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యంగా టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎప్పుడనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇందులో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
మంత్రిగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను పరిశీలించడం సంతోషంగా వుందన్నారు. ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడే బాధ్యత తనపై వుందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఒక హాఫ్ బాయిల్డ్లాగా తయారైందన్నారు. కొత్త బస్సుల్ని కొని అందులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉచితమని ఏదో ఒక బస్సులో కాకుండా, మంచి బస్సులను ఏర్పాటు చేస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ కూచోమన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని సరిగా విలీనం చేయలేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలో కార్యక్రమాలు లేట్‌గా అయినా లేటెస్ట్గా నిర్వహిస్తున్నామని రాంప్రసాద్ చెప్పడం విశేషం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఆయన కీలక కామెంట్స్ చేశారు.
అధ్యయన కమిటీ వేసి, పొరుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో స్వయంగా ప్రయాణించి, అక్కడి లోటుపాట్లను తెలుసుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రవాణాశాఖ మంత్రి చెప్పారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి మాటల్ని బట్టి… కనీసం రెండు మూడు నెలల సమయం తీసుకునే అవకాశం వుంది.