ఉక్కు శాఖ సహాయ మంత్రి అయినా ఏపీకి వచ్చింది అని సంతోషించాల్సిన సందర్భం ఇది. బీజేపీకి చెందిన నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు ఈ శాఖ లభించింది. ఆయన తాజాగా పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు విషయంలో ఆంధ్రుల సెంటిమెంట్ దెబ్బకుండా ఎలా ముందుకు వెళ్లాలో అలా ఆలోచిస్తామని వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది కోట్లాది మంది సెంటిమెంట్. దానికి దెబ్బ తగలకుండా వ్యవహరిస్తామని చెబుతున్నారు కానీ ప్రైవేటీకరణ మీద కేంద్ర మంత్రి కచ్చితమైన హామీ అయితే ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి.
పైగా నాన్ స్ట్రాటజిక్ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకు వచ్చిందని అన్నారు. తాను ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడను అని ఏపీకి చెందిన కేంద్ర ఉక్కు మంత్రి ప్రకటించారు
విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడం కోసం ఏమి చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో కలసి ప్రధాని మోడీతో చర్చిస్తామని చెప్పారు. దీనిని బట్టి చూస్తే బాబు పవన్ పూనుకోవాల్సిందే అన్నది అర్ధం అవుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం టీడీపీ, జనసేన మద్దతు మీద ఆధారపడి ఉంది. అందువల్ల ఈ ఇద్దరు నాయకులూ కేంద్రం వద్ద స్టీల్ ప్లాంట్ డిమాండ్ పెడితేనే ఏమైనా అవుతుంది అన్నదే కొత్తగా ఉక్కు బాధ్యతలు తీసుకున్న కేంద్ర మంత్రి మాటలకు అర్ధం అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
విశాఖ ఉక్కు మీద కమ్ముకున్న నీలినీడలు అలా కొనసాగుతూనే ఇంకా దట్టంగా అలముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది మోడీ స్థాయిలోనే తీసుకోవాల్సిన నిర్ణయం అని బోధపడుతుంది. ఆయనను ఒప్పించి మెప్పించేవారు ఎవరూ అన్నదే చర్చ.