ఇలా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలా రెండు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈసీ నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో ఉత్తరాంధ్ర నుంచి ప్రాధాన్యత ఇస్తారన్న ఆశలతో తమ్ముళ్ళు ఉన్నారని భోగట్టా. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు చాలా మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హై కమాండ్ హామీ ఇచ్చింది.
దాన్ని గుర్తు చేసుకుంటూ పలురువు పెద్దల సభపైన పెద్ద ఆశలే పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి దక్కితే కొత్త ప్రభుత్వంతో మొదటి అడుగులతోనే ప్రయాణం ప్రారంభించవచ్చు అన్నది చాలా మంది ఆరాటంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ పదవుల విషయంలో సీనియర్లు కూడా రేసులో ఉన్నారు. చట్ట సభలకు పుష్కర కాలంగా అడుగు పెట్టే అవకాశం దక్కని వారి నుంచి కొత్త వారు కూడా చాన్స్ తగిలితే పెద్ద మనిషి అయిపోవాలని అనుకుంటున్నారు.
ఏపీ శాసన మండలిలో మొత్తం ఆరు ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటాలో రెండు పదవులకు ఖాళీ ఏర్పడింది. ఇంకా నాలుగు పోస్టులు మిగిలి ఉన్నాయి. తొందరలోనే వాటికి కూడా ఈసీ నోటిఫికేషన్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. అలా స్థానిక సంస్థల కోటాలో ఉత్తరాంధ్రలో రెండు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యాయి.
ఇప్పటి నుంచే హై కమాండ్ తో టచ్ లో ఉంటే ఈ రోజు కాకపోయినా మరోసారి అయినా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని రెండు పోస్టులను ఈ ప్రాంతానికి చెందిన వారికే ఇవ్వాల్సి ఉంటుంది. అవి లోకల్ బాడీ కోటా నుంచి కాబట్టి వేరే ఆప్షన్ లేదు. దాంతో ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. టీడీపీ కూడా ఉత్తరాంధ్ర మీదనే ఫోకస్ పెట్టిన క్రమంలో తమ్ముళ్ళు తమకు అదృష్టం దక్కుతుందా అన్నది తర్కించుకుంటున్నారు.