వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతడి రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. మరి దర్శన్ కు బెయిల్ దక్కుతుందా? ఈ వారం రోజుల రిమాండ్ లో పోలీసులు సాధించిన పురోగతి ఏంటి? ఈరోజు కోర్టుకు సమర్పించనున్న పత్రాల్లో కేసుకు సంబంధించిన అసలైన నిజాలు వెలుగులోకి రాబోతున్నాయి.
అసలు విషయం అంగీకరించిన దర్శన్..?
ఈ కేసును పోలీసులు దాదాపు కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీన్ రీ-కనస్ట్రక్షన్ పని కూడా పూర్తిచేశారు. రేణుకాస్వామిని ఎలా షెడ్డుకు తీసుకొచ్చారు, ఎలా టార్చర్ చేశారు, ఎలా హత్య చేశారు, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి ఏం చేశారు లాంటి అంశాలన్నింటినీ సీన్ రీ-కనస్ట్రక్షన్ చేశారు. వీటితో పాటు సేకరించిన టెక్నికల్, ఫిజికల్ ఆధారాలన్నింటినీ ఈరోజు కోర్టుకు సమర్పించబోతున్నారు.
ఆధారాలన్నీ పక్కాగా ఉంటే దర్శన్ కు బెయిల్ రావడం కష్టమే. అయితే విచారించడానికి ఇంకే లేదంటే మాత్రం బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, తను హత్య చేయలేదని, కేవలం 2 దెబ్బలు మాత్రమే వేశానని, మిగతా వ్యక్తులు తన పేరు చెప్పి తనను ఇరికిస్తున్నారని దర్శన్ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసులో ఓ కీలక అంశాన్ని అతడు అంగీకరించినట్టు లీకులు వస్తున్నాయి. రేణుకాస్వామి మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితుల్లో ఒకరికి 30 లక్షలు ఇచ్చినట్టు దర్శన్ అంగీకరించాడట. అటు మర్డర్ జరిగిన టైమ్ లో సీన్ లో పవిత్ర ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రెండూ నిజమైతే దర్శన్-పవిత్రలకు బెయిల్ రాదు.
మరోవైపు కేసుకు సంబంధించి డీఎన్ఏ ఆధారాల కోసం పోలీసులు శాంపిల్స్ సేకరించారు. అవి వచ్చేంత వరకు దర్శన్-పవిత్రను రిమాండ్ కోరవచ్చు.
పోలీస్ స్టేషన్ లో దర్శన్ అసలు భార్య..
ఈ కేసులో దర్శన్ అసలు భార్య (పవిత్ర ప్రేయసి మాత్రమే) తెరపైకొచ్చారు. ఆమె పేరు విజయలక్ష్మి. తొలిసారి ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చారు. దాదాపు 3 గంటల పాటు పోలీసులు ఆమెను విచారించారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. అంతకంటే ముందు దర్శన్ ఇంటిని సోదా చేసిన పోలీసులు.. షెడ్డుకు దర్శన్ వేసుకెళ్లిన షూస్ ను స్వాధీనం చేసుకున్నారు.
మళ్లీ తెరపైకి ఒకప్పటి మిస్సింగ్ కేసు
ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈమధ్య దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడి కంటే ముందు దర్శన్ దగ్గర మల్లికార్జున్ అనే వ్యక్తి మేనేజర్ గా పనిచేశాడు. దర్శన్ వ్యవహారాలు చూసుకుంటూనే, వ్యక్తిగత స్థాయిలో మూవీ డిస్ట్రిబ్యూషన్, నిర్మాణాలు కూడా చేసేవాడు. అతడు 2016 నుంచి ఉన్నట్టుండి సడెన్ గా కనిపించకుండా పోయాడు. అతడి స్థానంలోకే శ్రీధర్ వచ్చాడు.
ఆ మిస్సింగ్ కేసు పెండింగ్ లో ఉంటుండగానే, శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడంతో దర్శన్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంది. కనిపించకుండా పోయిన మొదటి మేనేజర్ చాలా అప్పలు చేశాడు. హీరో అర్జున్ కూడా అతడికి కోటి రూపాయలు అప్పు ఇచ్చాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. 2016 నాటి అతడి మాజీ మేనేజర్ మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది.