కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక దాడులకు గురవుతున్న వర్గం ఏదైనా వుందంటే… ఉద్యోగ వర్గమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి కొన్ని రోజుల పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డాయి. ఇప్పటికీ అక్కడక్కడ వారిపై దాడులు సాగుతూనే వున్నాయి. అయితే చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తర్వాత మానసికంగా తీవ్ర దాడులకు గురవుతున్నది మాత్రం ఉద్యోగులే.
ఈ దఫా ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. జగన్ తమకు అన్యాయం చేశారనే ఆవేదనతో వైసీపీకి అన్ని రకాల ఉద్యోగులు వ్యతిరేకంగా ఓటు వేశారు, వేయించారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నింపడంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. జగన్‌ను గద్దె దించాలన్న ఉద్యోగుల కోరిక నెరవేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగుల అహం చల్లారింది.
కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అసలు సినిమా మొదలైంది. ఒక మహిళా మంత్రిగారేమో… మీకింకా జగన్‌పై అభిమానం వుంటే, ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని పదేపదే ఆదేశిస్తున్నారు. మీ రక్తం ఎరుపు బదులు పసుపు వుంటేనే మనుగడ అని చెప్పకనే చెబుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరొక మంత్రిగారేమో… పసుపు బిళ్ల వేసుకుని ఆఫీస్‌కు వస్తే, కాఫీ, టీలు ఇచ్చి మర్యాదతో పాటు పనులు చేసి పెట్టాల్సిందే అని హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాలు పాటించని ఉద్యోగులుంటే, ఏమవుతుందో బాగా తెలుసని హెచ్చరించారు. మరో ఇద్దరు సీనియర్ నాయకులు.. ఏకంగా నా కొడకల్లారా , నరుకుతా అంటూ తిట్ల పురాణం. ఇవన్నీ ఉద్యోగులపై చేసిన దూషణలే.
ఈ పరిణామాలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే జగన్‌పై కోపంతో వైసీపీని గద్దె దించి, కూటమిని తెచ్చుకున్నందుకు తగిన శాస్తి జరిగిందనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇష్టపడి తెచ్చుకున్న పాలకులు… తిట్టినా, కొట్టినా తియ్యగా వుంటుందని ఉద్యోగులపై సోషల్ మీడియాలో సెటైర్స్. ఇప్పుడిప్పుడే ఏర్పడిన కొత్త ప్రభుత్వం కావడంతో, ఉద్యోగ సంఘాల నాయకులు నోరు మెదపడానికి భయపడుతున్నారు.
ఒకటైతే నిజం… రానున్న రోజుల్లో తమ బతుకు అశాంతే అని ఉద్యోగులకు రెండువారాల కొత్త ప్రభుత్వ పాలన స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి… పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అనే సామెత చందాన ఉంది.