ప్రజల కన్ను ఎప్పుడూ అధికారం వైపే వుంటుంది. ఎందుకంటే, ప్రజల జీవితాలపై ప్రభావం చూపేది పాలనాపరమైన నిర్ణయాలే కాబట్టి. అధికార పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? అని ప్రజానీకం డేగ కన్నుతో నిఘా పెట్టి వుంటుంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలిసినంతగా, మరెవరికీ తెలియదు. ప్రజాజీవితంతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం వుంది.
పరిపాలకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అనేక అనుభవాలున్నాయి. ఇప్పుడు మరోసారి ఏపీ పరిపాలనా పగ్గాలు చేపట్టారు. కాలం శరవేగంగా పరుగెడుతోంది. ఈ నెల నాల్గో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమికి జనం పట్టం కట్టారు. అపరిమితమైన అధికారాల్ని ప్రజలు కట్టబెట్టారు. జనానికి అనుగ్రహం వచ్చినా, ఆగ్రహం వచ్చినా ఎవరూ ఆపలేరని గత రెండు దఫాల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
గత ఐదేళ్లలో జగన్ పరిపాలన, అలాగే వైసీపీ నాయకుల నోటి దురుసుపై ప్రజానీకం వ్యతిరేక తీర్పు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వుండడం వల్లే ఆ పార్టీని మట్టి కరిపించారనేది వాస్తవం. కూటమిపై ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే టీడీపీ నేతల వ్యవహార శైలులు మాత్రం… ఆదరించిన ప్రజల మనసుల్ని నొప్పించేలా ఉన్నాయనేది వాస్తవం.
అపరిమితమైన అధికారాన్ని ఇవ్వడం అంటే, తమ ఇష్టానురీతిలో పాలన సాగించాలని లైసెన్స్ ఇచ్చినట్టుగా కొంత మంది నేతలు భావిస్తున్నారు. అందుకే ఆ రకమైన నోటి దురుసు. టీడీపీ సీనియర్ నాయకులు అవాకులు చెవాకులు వింటుంటే… ఛీ ఇదేంద్రా బాబు అని రాజకీయాలపై అసహనాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ధోరణులను చంద్రబాబు వ్యతిరేకిస్తారనే పేరు వుంది.
కానీ వారం రోజులుగా రాష్ట్రంలో టీడీపీ నాయకుల నోటికి హద్దూపద్దూ లేకుండా పోతోంది. అయినప్పటికీ చంద్రబాబు, లోకేశ్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వైసీపీకి భిన్నమైన పాలన అందిస్తేనే కూటమి పాలనకు ఆయుష్షు పెరుగుతుంది. నాడు వైసీపీ అలా చేసింది కాబట్టే, తాము కూడా అంతకు మించి అరాచకాలకు పాల్పడుతామంటే అడ్డుకునే వారెవరూ వుండరు. ఐదేళ్లకు వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో అదే చేస్తారు. కావున జాగ్రత్త వహించాల్సింది చంద్రబాబే. తమను జనం గమనిస్తున్నారని చంద్రబాబు గుర్తించుకోవాలి.