తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ (గురువారం) వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం వైసీపీకి అత్యంత కీలకం. గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొననున్న సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశం కావడంతో జగన్ ఏం చెబుతారనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో వుంది.
జగన్ నిర్ణయాలపై వైసీపీ భవిష్యత్ ఆధారపడింది. రాజకీయ శిఖరాల్ని అధిరోహించిన వైసీపీ, ఈ ఎన్నికల్లో అథఃపాతాళానికి పడిపోయింది. మళ్లీ మొదటి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. తన పాలన నచ్చితేనే ఓటు వేయాలని జగన్ విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తన పాలన నచ్చకపోవడం వల్లే పరాజయం పొందానని జగన్ నమ్ముతున్నారా? అనేది ముందుగా తేలాలి.
ఎందుకంటే , తన ఘోర పరాజయానికి ఈవీఎంలే కారణమని జగన్ నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికీ ఆయన చుట్టూ ఉన్న వాళ్లే ఆ రకంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధోరణి ఆత్మహత్యా సదృశ్యమని హెచ్చరించక తప్పదు. ఘోర పరాజయం పాలయ్యామనే వాస్తవాన్ని అంగీకరిస్తేనే, తర్వాతి అడుగులు ఎలా అని ఆలోచించొచ్చు. ఆ పని చేయకుండా ఈవీఎంలపై నెట్టేసి, తమను తాము మోసగించుకోవాలని అనుకుంటే ఎవరైనా చేయగలిగేదేమీ లేదు.
అందుకే ఈనాటి సమావేశం వైసీపీకి అత్యంత కీలకం. పాలకుడిగా తానెక్కడ విఫలం అయ్యానని జగన్ ఈపాటికి తెలుసుకుని వుండాలి. తన వైపు జరిగిన తప్పిదాలకు మన్నింపు కోరాలి. అలాగే ఐదేళ్ల పాటు తాడేపల్లి ఇంటికే పరిమితమై, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోకుండా గడపడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని జగన్ గ్రహించాలి. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కానివ్వనని, వైసీపీ కేడరే తనకు ముఖ్యమనే నమ్మకాన్ని కలిగించాలి.
కూటమి ప్రభుత్వ పాలనపై నిశిత దృష్టి సారించాలి. ఆరు నెలలు లేదా ఏడాది సమయాన్ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి. ఈ ఆరు నెలలు లేదా ఏడాది గ్యాప్‌లో తటస్థులు, మేధావులు, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలతో జగన్ వరుసగా సమావేశం కావాలి. వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుని ముందుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలి. తనకు జనాన్ని, పార్టీ నాయకులు, కార్యకర్తల్ని దగ్గర చేసే వ్యక్తుల్ని చుట్టూ పెట్టుకోవాలి.
మళ్లీ బలపడాలంటే తనను తాను మార్చుకుంటున్నట్టు జగన్ ప్రకటించాలి. అలాగే క్షేత్రస్థాయిలో ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులు కూడా వైసీపీ కేడర్, అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా రానున్న రోజుల్లో ప్రణాళికలు రచించుకోవాలని దిశానిర్దేశం చేయాలి. వైసీపీ అంటే అన్ని కులాలు, మతాలు, వర్గాలకు ఆదరణీయమైన పార్టీ అని ఫీల్ గుడ్ కలిగేలా తీర్చిదిద్దాలి. ఇందుకోసం వైసీపీకి కొత్త రక్తం ఎక్కించాలి. ఇవన్నీ చేయగలిగితే వైసీపీకి భవిష్యత్. పార్టీని అలా నడిపించగలిగితేనే తనకు రాజకీయ భవిష్యత్ వుంటుందని జగన్ ఆలోచించి దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది.