న్యూయార్క్ చేయ‌క్క‌ర‌లేదు స్వామీ..!

గొప్ప‌లు చెప్పుకోవ‌డం, ఆర్భాటంగా మాట్లాడ‌టం, అతిశ‌యోక్తిగా మాట్లాడ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అధికారంలో ఉన్న‌వారికి ఈ  ల‌క్ష‌ణం మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. కేసీఆర్ అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా అతిశ‌యోక్తిగా మాట్లాడేవాడు. ఆయ‌న…

గొప్ప‌లు చెప్పుకోవ‌డం, ఆర్భాటంగా మాట్లాడ‌టం, అతిశ‌యోక్తిగా మాట్లాడ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అధికారంలో ఉన్న‌వారికి ఈ  ల‌క్ష‌ణం మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. కేసీఆర్ అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా అతిశ‌యోక్తిగా మాట్లాడేవాడు. ఆయ‌న చాలాసార్లు హైద‌రాబాద్‌ను డ‌ల్లాస్ చేస్తాన‌ని, పాత‌బ‌స్తీని ఇస్తాంబుల్ చేస్తాన‌ని చెప్పాడు. చాలా విదేశాల్లో న‌గ‌రాలు అందంగా ఉంటాయి. సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి అనేది వాస్త‌వం. అందుకే అమెరికాకు వెళ్లిన‌వారు తొంద‌ర‌గా ఇండియాకు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

విదేశీ న‌గ‌రాల మాదిరిగా మ‌న న‌గ‌రాలు కావాలంటే ఆషామాషీ కాదు. ఆ ప‌నిచేయ‌డం మ‌న నాయ‌కుల వ‌ల్ల కాదు. స‌రే.. విదేశీ న‌గ‌రాల గురించి చెప్పుకోవాంటే చాలా ఉంది. కేసీఆర్ డ‌ల్లాస్‌, ఇస్తాంబుల్ చేయ‌లేక‌పోయాడు గాని బంగారు తెలంగాణ అంటూ ఊద‌ర‌గొట్టి చివ‌ర‌కు అవినీతి తెలంగాణగా మార్చాడ‌న్న ఆరోప‌ణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న హ‌యాంలో జ‌రిగిన కుంభ‌కోణాలు వెలుగు చూస్తుంటే  చావు నోట్లో త‌ల‌పెట్టి తెలంగాణ తెచ్చాన‌ని చెప్పుకున్న కేసీఆర్ నిజ‌స్వ‌రూపం ఇదా అని ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది.

ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాదిరిగానే హైద‌రాబాద్‌ను న్యూయార్క్ చేస్తాన‌ని చెప్పాడు. అస‌లు విదేశీ న‌గ‌రాల పేర్లు చెప్పి ప్ర‌జ‌లు మోసం చేయ‌డ‌మెందుకు? వారిని భ్రమల్లో పెట్టడమెందుకు?

ప్రజలు సౌకర్యంగా, ఇబ్బందులు పడకుండా అభివృద్ధి చేస్తే అదే పదివేలు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి చేతనైతే వానా కాలంలో హైదరాబాద్‌ మునిగిపోకుండా ఉంటే న్యూయార్క్‌గా చేసినంత పుణ్యం లభిస్తుంది. మామూలు రోజుల్లో హైదరాబాద్‌ను చూసి ఆహా …ఓహో అనుకుంటాం. కాని చినుకుపడితే నగరం నరకంగా మారుతుంది. న్యూస్‌ పేపర్లు కూడా హైదరాబాద్‌ నగరం నరకంగా మారిందనే హెడ్డింగులు పెడతాయి. టీవీల్లో కూడా భయంకరమైన దృశ్యాలను చూపిస్తుంటారు.

సామన్య జనం బిక్కు బిక్కుమని గడుపుతుంటారు. రోడ్ల మీద ప్రాణాలు అరచేత పెట్టుకొని పోవల్సిన పరిస్థితి ఉంది. వాన పడుతున్న స‌మ‌యంలో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎక్కడ  మ్యాన్‌హోల్స్‌ ఉంటాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. వానాకాలంలో రోడ్ల మీద నడిచి వెళుతున్నవారు  మ్యాన్‌హోల్స్‌లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇక గ‌ల్లీలే కాదు ప్ర‌ధాన రోడ్లు కూడా చెరువుల‌ను త‌ల‌పిస్తుంటాయి.

ట్రాఫిక్ గంట‌ల త‌ర‌బ‌డి జామ్ అయిపోతుంది. అది క్లియ‌ర్ కావ‌డానికి కొన్ని గంట‌లు ప‌డుతుంది. వానా కాలంలో సిటీలోని నాలాలు పొంగిపొర్లుతుంటాయి. నాలాల వ‌ల్ల కూడా అనేక ప్ర‌మాదాలు జ‌రిగాయి. వానా కాలంలో హైద‌రాబాద్  న‌ర‌కంగా మార‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. చెరువుల ఆక్ర‌మ‌ణ‌, నాలాల ఆక్ర‌మ‌ణ, అడ్డ‌దిడ్డంగా అక్ర‌మ నిర్మాణాలు.. ఇలా లెక్క‌లేన‌న్ని కార‌ణాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌రిష్క‌రించ‌కుండా, అవినీతిని రూపుమాప‌కుండా న్యూయార్క్ చేస్తా, ఇంకో న‌గ‌రంలా చేస్తా అంటూ క‌బుర్లు చెబితే ఎలా?