జనసేన పార్టీకి తొలి ఎమ్మెల్సీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఖాళీ అవుతున్న రెండు శాసనమండలి సభ్యుల స్ధానాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ రెండు స్థానాలు ఎలాగూ కూటమికే. అయితే తెలుగుదేశం పార్టీ ఒకటి తీసుకుని, ఒకటి జనసేనకు ఇస్తుందా అన్నది పాయింట్.
ప్రస్తుతానికి అయితే చంద్రబాబు చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ బాహాటంగా చెప్పారు. భవిష్యత్ లో అన్ని రకాల పోస్ట్ లు తమకు కూడా వస్తాయని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
భాజపాతో పొత్తు కోసం త్యాగం చేసింది జనసేన. 21 స్ధానాలతో సరిపెట్టుకుంది. అందువల్ల ఇప్పుడు వస్తున్న రెండు ఎమ్మెల్సీలలో ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం వుంది. ఆ విధంగా శాసన మండలి లో కూడా జనసేనకు ప్రాతినిధ్యం దక్కినట్లు అవుతుంది. ఇలా వచ్చే ఎమ్మెల్సీ పదవిని పవన్ ఎవరికి కేటాయిస్తారు అన్నది చూడాలి.
సిఎమ్ రమేష్ కోసం త్యాగం చేసిన నాగబాబుకు కేటాయిస్తారా? లేక పార్టీని నమ్ముకున్న వేరెవరికైనా ఇస్తారా? లేదా, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన మాదిరిగా తెలుగుదేశం నుంచి జనసేనలోకి మార్చి, కండువా కప్పి ఇస్తారా? అలా చేస్తే మాత్రం పార్టీ నమ్ముకున్న వారు పూర్తిగా నిరాశ చెందుతారు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ దే.