మండలిలో బలం పెంచుకోనున్న తెదేపా!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ బలం పెరగనుంది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలంతో పోల్చుకుంటే వారి బలం పెరుగుదల కూడా నామమాత్రమే! అయినా రాబోయే రోజుల్లో మరింతగా మండలిపై పట్టు బిగించేందుకు…

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ బలం పెరగనుంది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలంతో పోల్చుకుంటే వారి బలం పెరుగుదల కూడా నామమాత్రమే! అయినా రాబోయే రోజుల్లో మరింతగా మండలిపై పట్టు బిగించేందుకు తెలుగుదేశానికి ఈ పరిణామం ఉపయోగపడుతుంది.

ఎన్నికలకు ముందు అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలు షేక్ మహ్మద్ ఇక్బాల్, సి.రామచంద్రయ్యలను మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు అనర్హులుగా ప్రకటించారు. వారి స్థానంలో ఏర్పడిన ఖాళీలకు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ స్థానాలకు 12వ తేదీన ఎన్నిక జరుగుతుంది.

ఈ రెండూ కూడా ఎమ్మెల్యే కోటాలో భర్తీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో ఇప్పుడు తెలుగుదేశానికి ఎడ్వాంటేజీ కానుంది. ఆ కూటమికి ప్రస్తుతం 164 స్థానాల బలం ఉంది. దాంతో ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిసార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా పూర్తిగా వారికే దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రెండు స్థానాలు కూడా కూటమి పరం కాబోతున్నాయి. అయితే రెండింటినీ తెలుగుదేశం తీసుకుంటుందా? లేదా, కూటమి పార్టీలకు కేటాయించే అవకాశం ఉందా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

58 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ లో ప్రస్తుతం తెలుగుదేశానికి ఉన్న బలం 8 స్థానాలు మాత్రమే. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ కు ఏకంగా 38 మంది సభ్యులున్నారు. నలుగురు ఇండిపెండెంట్లు కాగా, పీడీఎఫ్ కు చెందిన వారు ఇద్దరు. ఆరుస్థానాలు ఖాళీ ఉన్నాయి. ప్రస్తుతం రెండింటికి ఎన్నిక జరగబోతుండగా.. తెదేపా బలం 10కి పెరుగుతుంది. అయినా సరే.. వివాదానికి, ఓటింగుకు దారితీసే బిల్లులు ఏవైనా సరే.. మండలి ఆమోదం పొందడం వారికి కష్టమే.

వైసీపీ బలాన్ని దాటి.. వారు మండలిలో తమ కూటమికి ఎప్పటికి క్లియర్ మెజారిటీ సాధించగలరనేది ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్రతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కూటమి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీలను ఫిరాయింపజేసి తమ కూటమిలో చేర్చుకోవడానికి కూడా చంద్రబాబునాయుడు తరఫున వ్యూహాలు నడుస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. 2014లో గెలిచిన తర్వాత.. ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తమతో కలిపేసుకున్నారు.

ఇప్పుడు ఆయన ప్రభుత్వం చేసే చట్టాలు.. మండలిలో కూడా నిరభ్యంతరంగా ఆమోదం పొందాలంటే.. వారికి ఇంకా 20 మంది సభ్యుల బలం అవసరం ఉంది. మరి వేచిచూసి ఎన్నికల్లో నెగ్గుతూ క్రమంగా బలం పెంచుకుంటారో.. లేదా, వైసీపీ నుంచి ఫిరాయింపుల మీద ఆధారపడతారో వేచిచూడాలి.