సోమవారం అంటే పోలవారం అనే పాత నానుడిని చంద్రబాబునాయుడు మళ్లీ వాడుకలోకి తీసుకువచ్చారు. తాను సీఎంగా పదవిని స్వీకరించిన తర్వాత.. తొలి సోమవారమే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
పోలవరం ప్రాజెక్టును ఎప్పటికి పూర్తి చేయగలమో అర్థం కాని రీతిలో తయారు చేయడానికి ప్రధానకారణం జగన్మోహన్ రెడ్డి అని నింద వేసేసి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవడమే చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి మేలు అని.. పరువు పోకుండా ఉంటుందని పార్టీలో సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి రెండు ప్రభుత్వాల సారథ్యంలో జరిగిన పనుల పుణ్యమాని పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉంది. సింపుల్ గా చెప్పాలంటే.. మళ్లీ అంతా మొదటినుంచి ప్రారంభించాలేమో అనిపించేలా ఉంది. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సంబంధించి రెండు పార్టీలు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
తెలుగుదేశం కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా కట్టడం వల్లనే కొట్టుకుపోయిందని వైసీపీ అంటోంది. అయితే.. రివర్స్ టెండరింగ్ లాంటి మాయ మాటలతో కేవలం కాంట్రాక్టరును మార్చడం వల్లనే.. పూర్తి స్థాయిలో నిర్మాణం జరగని డయాఫ్రం వాల్ ను గాలికొదిలేశారని అది దెబ్బతిన్నదని తెలుగుదేశం ఆరోపిస్తోంది. తప్పు ఎవరిదైతేనేం.. రాజకీయ చదరంగంలో ప్రాజెక్టు నాశనం అయింది.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది? అనేది కదా ప్రజలు ఆలోచిస్తున్నది? చంద్రబాబు చేతికి ప్రజలు ఎందుకైతే అధికారం అప్పజెప్పారో వాటిలో పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటి కదా! 2019లో తాము దిగిపోయే సమయానికి 72 శాతం పూర్తిచేశామనం గప్పాలు కొట్టుకున్న చంద్రబాబు.. ఈ అయిదేళ్లలో దానిని పూర్తిచేయకపోతే ప్రజలు క్షమిస్తారా? -అదేమరి తెలుగుదేశంలోని సీనియర్ల భయం కూడా. అలాగని.. దెబ్బతిన్న పనులన్నింటినీ మళ్లీ ప్రారంభించి పూర్తిచేసి, మరోవైపు నిర్వాసితులకు 33వేల కోట్ల రూపాయల పరిహారాలను చెల్లించి.. ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం సాధ్యమేనా?
అందుకే నిర్మాణ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడం మేలనే వాదన వినిపిస్తోంది. ఎటూ పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక.. నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించేస్తే.. పూర్తిచేసినా, ఆలస్యమైనా వారి మీదకు వెళ్తుందని.. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రాజధాని, పరిశ్రమల కల్పన వంటి ఇతర కీలక అంశాల మీద శ్రద్ధగా ఫోకస్ పెట్టవచ్చునని అంటున్నారు.
మరి చంద్రబాబునాయుడు.. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో దాని నిర్మాణ భాధ్యత కేంద్రం చేతిలో పెట్టేయడానికి అంగీకరిస్తారా? అనేది వేచిచూడాలి.