నర్సీపట్నం ఎమ్మెల్యే, కాబోయే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంతో పెద్ద మనసుతో వ్యవహరించారు. నిజానికి ఆయనకు ఉద్యోగులు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నర్సీపట్నంలో మంగళవారం ఆయన మున్సిపల్ ఉద్యోగుల్ని బండబూతులు తిట్టారు. చుట్టూ టీడీపీ కార్యకర్తలను పెట్టుకుని అధికారులపై ఆయన చెలరేగడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎన్నికల్లో వైఎస్ జగన్పై కసితో టీడీపీతో పాటు కూటమి పార్టీలకు ఎగిరెగిరి ఓట్లు వేసినట్టు ఉద్యోగులు సంబరంగా చెప్పారు. అయితే ఆ సంతోషం రెండు వారాల ముచ్చటే అని తేలిపోయింది. ఎన్నికల ఫలితాలొచ్చి గట్టిగా రెండు వారాలకు ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఏదో అనుకుంటే, ఇంకేదో అవుతోందే అని ఉద్యోగులు నసుగుడు ప్రారంభమైంది.
అయితే ఉద్యోగులపై బూతుల వరకే అయ్యన్నపాత్రుడు పరిమితం అయ్యారని, కొట్టనందుకు సంతోషించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన ఉద్యోగులపై ఆ మాత్రం బూతులు ఉండాల్సిందే అంటున్నారు.
పెద్ద మనసుతో నడిరోడ్డుపై తమను కొట్టనందుకు అయ్యన్నకు ఉద్యోగులు థ్యాంక్స్ చెప్పాలనేది కూటమి నేతల అభిప్రాయం. అయ్యన్నలా ఉద్యోగుల్ని తిడితే తప్ప, వారు దారికి రారనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొనడం గమనార్హం.