ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియాను తన వైపు తిప్పుకుంది. కిడ్నాప్‌తో పాటు ఇతరత్రా కేసుల్లో ఆమె ఇరుక్కున్నారు. ఇప్పుడు చేతిలో అధికారం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష వైసీపీ నేతలపై భౌతికదాడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. అలాగే వైఎస్సార్ విగ్రహాలపై దాడులు, వాటి తొలగింపు, వైసీపీ నేతల ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ రాష్ట్ర నాయకుడు ఏవీ సుబ్బారెడ్డికి చెందిన ఆస్తులపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఏవీ ఫంక్షన్ హాల్, ఏవీ ప్లాజా హోటల్, కాంప్లెక్స్‌లపై అఖిలప్రియ అనుచరులు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలతో సినిమా, హోటల్‌కు వచ్చిన ప్రజానీకం భయాందోళన చెందారు. అసలేం జరుగుతున్నదో అర్థంకాక, పరుగులు తీసినట్టు చెబుతున్నారు.
నంద్యాల జిల్లా టీడీపీలో వర్గపోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య గతంలో గొడవలు జరిగాయి. లోకేశ్ యువగళం పాదయాత్రలో సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు భౌతికదాడికి పాల్పడ్డారు. ఏవీ దంతాలు ఊడగొట్టారు. ఇప్పుడు ఏవీ ఆస్తులపై అఖిలప్రియ అనుచరులు దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ఇవి ఇప్పటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.