వైసీపీదే అరాచ‌కం అనుకుంటే.. వీళ్లు అంత‌కు మించి!

ఈ నెల నాల్గో తేదీన ఏపీ పాల‌కులెవ‌రో తేలిపోయింది. కూట‌మి అధికారికంగా పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌నే వారి ప‌రిపాల‌న అన‌ధికారికంగా మొద‌లైంది. ఈ రెండు వారాల్లో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తే……

ఈ నెల నాల్గో తేదీన ఏపీ పాల‌కులెవ‌రో తేలిపోయింది. కూట‌మి అధికారికంగా పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌నే వారి ప‌రిపాల‌న అన‌ధికారికంగా మొద‌లైంది. ఈ రెండు వారాల్లో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తే… వైసీపీదే అరాచ‌క పాల‌న అనుకుంటే, దాన్ని వీళ్లు మించిపోయేలా ఉన్నారే అనే టాక్ మొద‌లైంది. అయితే ఎల్లో మీడియాలో కూట‌మి అరాచ‌కాల‌కు చోటు లేక‌పోవ‌డంతో అంతా మంచిగా సాగుతోంద‌నే భావ‌న‌లో ఉండొచ్చు.

చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీరి వార‌మ‌వుతోంది. అప్పుడే మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యోగుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడ్డారంటూ, త‌న మాట‌ల్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ఉద్యోగ సంఘం నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డడం గ‌మ‌నార్హం. కొత్త ప్ర‌భుత్వంపై ఉద్యోగుల మ‌నోభిప్రాయాన్ని ఏపీ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు భూప‌తిరాజు ర‌వీంద్ర‌రాజు, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అప్ప‌ల‌నాయుడు వెల్ల‌డించిన‌ ప్ర‌క‌ట‌న ప్ర‌తిబింబిస్తోంది. అదేంటంటే…

” రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం బాధాక‌రం. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 10 రోజులు కూడా గ‌డ‌వ‌కుండానే మంత్రి మాట్లాడిన తీరు ఉద్యోగుల‌ను కించ‌ప‌రిచేలా ఉంది. ఉద్యోగుల‌ను బెదిరించ‌డం, మాట విన‌ని ఉద్యోగుల్ని ఏమైనా చేస్తామ‌న‌డం ఆవేద‌న క‌లిగిస్తోంది.  అచ్చెన్నాయుడు త‌న మాట‌ల్ని వెన‌క్కి తీసుకోవాలి”

“ప‌చ్చ‌బిళ్ల వేసుకుని వెళితే చాలు, ఎస్ఐ, ఎమ్మార్వో, ఎంపీడీవో…ఇలా ఏ అధికారైనా కుర్చీ వేసి, టీ ఇచ్చి గౌర‌వంగా చూస్తారు. ప‌నుల్ని చేసి పెడ‌తారు. ఒక‌వేళ ఒక‌రిద్ద‌రు అధికారులు నా మాట జ‌వ‌దాటితే ఏమ‌వుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు” అని ఉద్యోగుల్ని అచ్చెన్నాయుడు బ‌హిరంగంగా హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అచ్చెన్నాయుడు ఆ మాట అన్న వెంట‌నే, అన్న‌మ‌య్య జిల్లాలో టీడీపీ నాయ‌కుడు అమ‌లు చేసి చూపారు.

నంద‌లూరులో ఎంపీపీ, వైస్ ఎంపీపీతో ఎంపీడీవో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి వెళ్లిన టీడీపీ నాయ‌కుడు మేడా విజ‌య‌శేఖ‌ర్ దాదాగిరి చెలాయించారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశం ఎలా నిర్వ‌హిస్తావ‌ని ఎంపీడీవోను, అలాగే హాజ‌రైన ఎంపీపీ, వైస్ ఎంపీపీని ఆయ‌న ఇష్ట‌మొచ్చిన‌ట్టు దూషించారు. జ‌స్ట్ ఇది ట్రైల‌రే. ప్ర‌భుత్వం ఏర్ప‌డి వార‌మే అయ్యింది.

రానున్న రోజుల్లో అధికార పార్టీ నేత‌ల దుర్మార్గాలు ఎలా వుంటాయో , ఈ రెండు వారాల్లో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లు శాంపిల్స్ మాత్ర‌మే అని అంటున్నారు. గ‌తంలో వైసీపీ పాల‌న‌లో 25 శాతం అరాచ‌కాలు జ‌రిగాయ‌ని అనుకుంటే, తాము దాన్ని 75 శాతం చేస్తామ‌నే రేంజ్‌లో టీడీపీ నేత‌లు బ‌రి తెగిస్తున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత వైసీపీలో ధైర్యం వ‌చ్చింది. అరాచ‌కంలో తామే న‌య‌మ‌ని, కూట‌మి ప్ర‌భుత్వం ఆరు నెల‌లు లేదా ఏడాదికే పూర్తిగా భ్ర‌ష్టు ప‌ట్టేలా వుంద‌న్న అభిప్రాయాన్ని క‌లిగిస్తోంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

సామాన్య ప్ర‌జానీకం కూడా ఏపీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. పోయిన ప్ర‌భుత్వ‌మే మేలుగా వుంద‌న్న అభిప్రాయాన్ని కూట‌మి చాలా వేగంగా ఏర్ప‌ర‌స్తోంద‌ని మాట బ‌లంగా వినిపిస్తోంది. చంద్ర‌బాబు ఏ మేర‌కు అరాచ‌కాల‌ను అడ్డుకుంటారో చూడాలి.