బీజేపీకి కమిటెడ్ లీడర్స్ ఉన్నారు. కానీ ఆ పార్టీ ఎత్తిగిల్లలేకపోతోంది. ఉత్తరాంధ్రలో కాస్తో కూస్తో బలం ఉన్న చోటనే ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో ఒక బిగ్ షాట్ అయిన సీఎం రమేష్ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన బీజేపీకి కొత్త ఆశగా కనిపిస్తున్నారు.
కడప నుంచి వచ్చి గెలవడమే ఒక రికార్డు అనుకుంటే బీజేపీ గుర్తు అంటే తెలియని ప్రాంతాలకు దానిని తెలిసేలా చేసి గెలవడం మరో రికార్డు. ఎంపీగా గెలిచిన రమేష్ కి అభినందన సభ పేరుతో కార్యక్రమం విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర బీజేపీకి తాను పెద్ద దిక్కుగా ఉంటాను అన్నారు. బీజేపీని అన్ని చోట్లా విస్తరించేలా తాను చర్యలు తీసుకుంటాను అని అన్నారు.
విశాఖలో బీజేపీని బ్రహ్మాండమైన భవనాన్ని తాను నిర్మించి ఇస్తాను అని హామీ ఇచ్చారు. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని తాజా ఎన్నికల్లో బీజేపీకి అనకాపల్లి ఎంపీ స్థానంలోనే 70 శాతం ఓట్లు పడ్డాయని మొత్తం ఉత్తరాంధ్రలో వైసీపీకి ముప్పయి శాతం ఓటింగ్ రాలేదని అన్నారు.
అందువల్ల బీజేపీని ఇక మీదట విస్తరించేందుకు తాను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పకనే చెప్పారు. బీజేపీ నేతలకు తాను అన్ని వేళలలో అందుబాటులో ఉంటాను అని సీఎం రమేష్ ప్రకటించారు. రమేష్ ని ఉత్తరాంధ్ర పంపడం ద్వారా బీజేపీ ఎంపీ సీటు గెలుచుకుంది. ఇపుడు పార్టీ విస్తరణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వ్యూహాలలో తనకు సాటి లేరని చాటుకునే రమేష్ వచ్చే స్థానిక ఎన్నికల నాటికల్లా కమలం పార్టీకి ఒక రూపు రేఖా తీసుకుని వస్తారని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. బీజేపీ ఉత్తరాంధ్ర నేలలలో బంగారం అవుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది.