ఆరేళ్లు ప్రేమించుకున్నారు, అభిప్రాయబేధాలొచ్చి విడిపోయారు. అమ్మాయి బాగానే ఉంది. అబ్బాయి మాత్రం దీన్ని తట్టుకోలేకపోయాడు. దీనికితోడు తాజాగా జరిగిన ఓ గొడవ అతడిలో విద్వేషాన్ని రగిల్చింది. ఫలితంగా నడిరోడ్డుపై తన మాజీ ప్రేయసిని హత్య చేశాడు. ముంబయిలో జరిగింది ఈ ఘటన.
రోహిత్ యాదవ్, ఆర్తీ యాదవ్ బాగా పరిచయస్తులు. దాదాపు ఆరేళ్లు వాళ్లు ప్రేమించుకున్నారు. కానీ ఆ తర్వాత అతడి నుంచి ఆర్తి విడిపోయింది. దీనికి సంబంధించి ఆర్తీని పలుమార్లు ప్రశ్నించాడు రోహిత్. ఒక దశలో ఆమె సెల్ ఫోన్ ను కూడా విసిరికొట్టాడు.
దీంతో ఆర్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. రోహిత్ పై ఫిర్యాదు చేసింది. పోలీసులు రోహిత్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఓవైపు ఇదిలా నడుస్తుండగా, మరోవైపు ఆర్తీ, మరో వ్యక్తికి దగ్గరవుతుందని అనుమానించాడు రోహిత్. దీన్ని అతడు అస్సలు తట్టుకోలేకపోయాడు.
తనకు దక్కని అమ్మాయి మరెవ్వరికీ దక్కకూడదని ఫిక్స్ అయ్యాడు. ఈరోజు ఉదయం వసాయి లో ఏదో పని మీద రోడ్డుపై వెళ్తోంది ఆర్తి. రోడ్డంతా రద్దీగా ఉంది. ఆమెను కొద్దిదూరం నుంచి వెంబడిస్తున్న రోహిత్, బ్యాగ్ లోంచి రెంచీ తీశాడు. వెనక నుంచి వచ్చి ఆర్తి తలపై బలంగా కొట్టాడు.
ఆర్తి అక్కడికక్కడే కుప్పకూలింది. రోహిత్ మాత్రం ఆగలేదు. కసితీరా రెంచీతో ఆమె తలపై 17 సార్లు కొట్టాడు. ఇది చూసిన ఓ వ్యక్తి రోహిత్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు, కానీ బెదిరించడంతో వెనక్కు తగ్గాడు. మిగతా వాళ్లంతా చోద్యం చూశారు.
ఇవన్నీ దగ్గర్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొంతమంది తమ సెల్ ఫోన్లలో కూడా రికార్డ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రోహిత్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు.