టెక్నాలజీ పెరుగుతోంది.. ట్రాక్స్ పై వందేభారత్ రైళ్లు పరుగెడుతున్నాయి.. కానీ సిగ్నలింగ్ లో మాత్రం అదే లోపం. దేశ రైల్వే చరిత్రలో సిగ్నలింగ్ లోపాల వల్ల జరిగిన ఘోర ప్రమాదాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పుడు మరో దారుణం.
పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. క్షతగాత్రుల పరిస్థితి చూస్తుంటే, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని స్వయంగా అధికారులు చెబుతున్న మాట. 65 మందికి చుట్టుపక్కల హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.
నిత్యం రద్దీగా ఉండే కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును అదే ట్రాక్ పై వెనక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంచన్ జంగ్ ఎక్స్ ప్రెస్ బోగీ ఒకటి గాల్లోకి తేలిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఒకే ట్రాక్ పైకి 2 ట్రయిన్స్ వచ్చాయంటేనే అది సిగ్నలింగ్ లోపం అని ఈజీగా అర్థమౌతోంది. అయితే తాము రెడ్ సిగ్నల్ ఇచ్చినా, గూడ్స్ రైలు ఆగలేదంటున్నారు అధికారులు. నిజమేంటో చెప్పడానికి గూడ్స్ రైలు డ్రైవర్ బతికిలేడు.
గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లిలో ఇదే విధంగా రెండు రైళ్లు ఢీకొట్టాయి. ఆ ప్రమాదం నుంచి రైల్వే శాఖ ఎలాంటి పాఠం నేర్చుకోలేదని అర్థమౌతోంది.