ప్రభుత్వ ఉద్యోగం కదా… డ్యూటీకి వెళ్లినా, వెళ్లకపోయినా జీతం వస్తుందనే ధీమా. ఉద్యోగ విధుల్లో సమయ పాలన అసలు పాటించని విభాగాలెన్నో ఉన్నాయి. ఉద్యోగులు ఆలస్యంగా రావడం, ముందే వెళ్లడాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలాంటి ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని మోదీ సర్కార్ సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఆలస్యంగా విధులకు వస్తే, సెలవుగా పరిగణించాలని ఆదేశాలిచ్చింది.
ఉద్యోగుల హాజరపై కఠినంగా వ్యవహిరంచాలని అన్ని ప్రభుత్వ శాఖలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక మీదట విధులకు ఆలస్యంగా రావడం, అలాగే త్వరగా వెళ్లేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టొద్దని హెచ్చరించింది. తప్పనిసరిగా బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎవరైనా బయోమెట్రిక్‌లో హాజరు వేయకపోతే, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చిరించడం గమనార్హం.
అలాగే సమయ పాలన పాటించకుండా, ఇష్టానురీతిలో విధులకు హాజరయ్యే వారి సెలవుల్లో కోత విధించాలని పేర్కొంది. సరైన కారణాలుంటేనే నెలలో రెండుసార్లు, అలాగే రోజుకు గంట సమయం ఎక్కువ కాకుండా ఆలస్యంగా వస్తే పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టపరిచింది.
ఈ నేపథ్యంలో కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మోదీ సర్కార్‌పై రుసరుసలాడుతున్నారు. ఎందుకంటే, తాము ఏం చేసినా అడగకూడదని ఉద్యోగుల భావన. అందుకు విరుద్ధంగా ఆదేశాలు వుండడంతో సహజంగానే వారి ఆగ్రహానికి మోదీ సర్కార్ గురి కావాల్సి వస్తోంది.