ఘోర పరాజయం నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. కేవల 11 అసెంబ్లీ, నాలుగు ఎంపీ సీట్లకు పరిమితమైన నేపథ్యంలో జగన్ తిరిగి పార్టీని ఎలా అధికారంలోకి తేగలరనే సందేహం ఆ పార్టీ శ్రేణుల్లో వుంది. అయితే ఓడిపోయినంత మాత్రాన, భవిష్యత్ లేదనుకోవద్దని తన పార్టీ నాయకులకు జగన్ ధైర్యం చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో 19న జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ సమావేశమై, ఘోర పరాజయంపై మాట్లాడనున్నారు. అభ్యర్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులపై ఎలా ముందుకెళ్లాలో అందరితో చర్చించి, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు.
టీడీపీ దాడిలో గాయపడ్డ వైసీపీ శ్రేణుల్ని ఆయన పరామర్శించనున్నారు. అలాగే భవిష్యత్‌పై భరోసా ఇచ్చేలా క్షేత్రస్థాయి పర్యటనలు జగన్ చేయనున్నారని తెలిసింది. ఈ మేరకు ఎప్పటి నుంచి జనంలోకి వెళ్లాలనే విషయమై త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కొత్త ప్రభుత్వంపై ఇప్పట్లో ఆయన ఎలాంటి విమర్శలు చేయొద్దని అనుకుంటున్నారు. అలివికాని హామీలిచ్చారని, వాటి అమలు ఎలా వుంటుందో చూసి, ఆ తర్వాత ముందుకెళ్లాలనేది జగన్ ఆలోచన. అందుకే చంద్రబాబు పాలనపై ఆయన ప్రేక్షక పాత్ర పోషించాలని అనుకుంటున్నారు.
ప్రభుత్వ పనితీరుపై డేగ కన్నేసి వుంచాలని భావిస్తున్నారు. ఏడాది తర్వాత చంద్రబాబు పరిపాలనపై జనం ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం వుందని, ఆ పరిస్థితుల్ని బట్టి అడుగులు ఏ విధంగా ముందుకు వేయాలో ఆలోచించొచ్చని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ లోపు ఏం చేయాలో 19న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.