ఆరు గ్యారెంటీల.. ద‌ర‌ఖాస్తులు ఏమ‌య్యాయ్‌?

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని బీఆర్ఎస్ నుంచి విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లైంద‌ని, ఇంత వ‌ర‌కూ ఏం చేశార‌ని ఆ పార్టీ నేత‌లు నిలదీస్తున్నారు. ఆరు…

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని బీఆర్ఎస్ నుంచి విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లైంద‌ని, ఇంత వ‌ర‌కూ ఏం చేశార‌ని ఆ పార్టీ నేత‌లు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమ‌లుపై బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌నా అస్త్రాల‌ను సంధిస్తున్నారు. మాజీ మంత్రి హ‌రీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరునెల‌లైంద‌ని, హామీల అమ‌లు ఊసే ఎత్త‌డం లేద‌ని విమ‌ర్శించారు. పింఛన్‌ ఎప్పుడిస్తార‌ని అవ్వతాతలు అడుగుతున్నారని హ‌రీష్‌రావు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పెన్షన్‌ వచ్చేద‌ని అవ్వాతాత‌లు గుర్తు చేస్తున్నార‌న్నారు. రెండు నెలల నుంచి ఆసరా పింఛన్‌ రావడం లేదని ఆయ‌న ఆరోపించారు. అవ్వతాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ఆయ‌న‌ ప్రశ్నించారు.

తక్షణమే పెండింగ్‌లో ఉన్న పింఛన్‌ను విడుదల చేయాలని హ‌రీష్‌ డిమాండ్‌ చేశారు. ప్రజాపాలన పేరుతో తీసుకున్న ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఏమయ్యాయని రేవంత్ స‌ర్కార్‌ను ఆయ‌న నిల‌దీశారు. ప్రజాపాలన ఆచరణలో ఏమైందన్నారు. పేదలపై ఇంత వివక్ష ఎందుకని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఏపీ సీఎం మొదటి సంతకంతో పింఛన్‌ రూ.4 వేలకు పెంచారని, మీరు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. పొరుగునే ఉన్న‌ ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ఇస్తున్న‌ప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ఇంటికి రెండు పింఛన్లు ఇస్తామన్నారని గుర్తుచేశారు.