రంగుల పక్షిని దూరం నుంచి చూస్తేనే అందం. సౌందర్యం దానికి తెలియదు. తెల్లారితే జీవన పోరాటం, రెక్కల కష్టం. రాళ్లు మోసేవాడికి తాను తాజ్మహల్ కడుతున్నానని తెలియదు. ఆకలికి అందం, సౌందర్యం వుండవు. బొర్రా గుహల్లో ఫొటోలు తీసేవాడికి, అజంతా గుహల ముందు పల్లీలు అమ్మేవాడికి ఒక అద్భుతంతో కలిసి జీవిస్తున్నామని తెలియదు.
అలవాటైతే అన్ని పాతబడిపోతాయి. అద్భుతాలు బయట వుండవు. మన లోపల వుంటాయి. వెతికి పట్టుకోవాలి. అన్వేషణ అవసరం లేని కాలం. ఒక పదానికి అర్థం కోసం, విశ్లేషణ కోసం, లైబ్రరీలను చెదపురుగుల్లా తొలచిన కాలం మాయమైంది. వడ్డించిన విస్తరి గూగుల్. కనిపించేది విందు కాదు, తింటేనే భోజనం.
ఆఖరి విందులో ద్రోహి ఎవరు? డావెన్సీ చేతి వేళ్లలోని మంత్రజాల మహత్యం ఏమిటి? పంజరంలోని పక్షిని వదిలి చూడు. తిండి కోసం అక్కడికే వస్తుంది. పోరాడే వాళ్లు పంజరాల్లో వుండరు. పంజర జీవులకి పోరాటం తెలియదు.
దేవుడికే ద్రోహం చేసిన వాళ్లు మనిషిని వదులుతారా? ద్రోహం ఒక బ్లడ్ గ్రూప్. యూనివర్సల్. ఒకడిని మించి ఇంకొకడు కథలు చెబుతుంటే, పుస్తకాలు రాసేవాడు, కొనేవాడు ఎక్కడ? పఠనం లేదు, అంతా శ్రవణమే. బ్రెయిలీ మేధావులు తడుముతూ ఏదైనా మాట్లాడుతారు.
జీవితం ఫోర్లేన్ నుంచి ఇరుకు రోడ్లలోకి ప్రవేశిస్తే ఆశ్చర్యపోవద్దు. జలపాతాలు, పచ్చిక బయళ్లు, కొండ శిఖరాల ఎత్తు చూడాలంటే మట్టి మీదే నడవాలి. నాలుగు రోడ్ల మీద టోల్గేట్లు మాత్రమే వుంటాయి. రసం పిండడానికి.
మానవ ముఖాలన్నీ ఒక్కోలా కనబడితే అది నీ దృష్టి దోషం కాదు. అందరూ ఇతరుల్లా వుంటూ తామెలా వుంటామో మరిచిపోయారు.
గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారడం ఒక భ్రాంతి. తమలో సీతాకోక వుందని తెలియకుండానే రాలిపోయే పురుగులు ఎన్నో. మనిషిలో కూడా ఎన్నో రంగులుంటాయి. ఇంద్రధనస్సు బయటికి తీయాలంటే వాన రావాలి. కళ్లలోంచి.
తుపాను ఎదుర్కున్నవాడే నావికుడు. విశ్రాంతి తీసుకునే వాడికి ఈతరాదు. చిరుగుల వస్త్రంలో ఈ ప్రపంచం పాతదై పోయింది. కొత్త ప్రపంచాన్ని వెతుకుతూ కవిత్వం ఆత్మహత్య చూసుకుంది. నువ్వెన్ని సార్లు నిద్రలేచినా కనిపించేది ఆ నాలుగు గోడలే.
పుస్తకం చదివితే జ్ఞానం రాదు. అదే నిజమైతే చెదపురుగుకి మించిన వేదాంతవేత్త లేడు. పులి సన్యాసం తీసుకున్నా కందమూలాలు తినలేదు. జంతువులకి దాహం లేకపోతే మొసళ్లు బతకవు. ఒకరి అవసరం, ఇంకొకరికి ఆహారం.
ఉల్లిపాయలా జీవించడం ఒక కళ. పొరలు విప్పుతూ పోతే చివరికి ఏమీ వుండదు. విప్పిన వాడికి ఏడుపు. అనేక మరలు కలిస్తే ఒక యంత్రం. అనేక ఎరలు విసిరితే ఒక జీవితం. యాంత్రిక జీవితం , తాంత్రిక జీవితం.
గాల్లోకి రాయి విసిరితే కిందపడుతుంది. అది భూమ్యాకర్షణ శక్తి. గాల్లోకి నాణెం విసిరి చూడు. కింద పడనివ్వరు. అది ధనాకర్షణశక్తి. భూమి పుట్టిన తరువాతే డబ్బు పుట్టింది. డబ్బు కోసం భూమ్మీద వున్నంత కాలం యుద్ధమే.
భూమికి మనం ఒక దావత్. పిలుస్తూ వుంటుంది. తేదీలేని ఆహ్వానం.
జీఆర్ మహర్షి