సింపుల్ గా ఉండే విజయ్ సేతుపతి మాటలు కూడా అంతే సింపుల్ గా ఉంటాయి. తన 50వ సినిమాగా మహారాజా మూవీ చేసిన విజయ్ సేతుపతి, మంచి సినిమా తీశామని మాత్రమే నమ్మామని, దాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ఘనత మాత్రం ప్రేక్షకులదే అంటున్నాడు.
“వారం కిందట ఇది నేను ఊహించలేదు. ఓ 200 మందికి చూపించాం. వాళ్లంతా బాగుందన్నారు, స్క్రీన్ ప్లే బాగుందని మెచ్చుకున్నారు. మేం కూడా అదే నమ్మకంతో ఉన్నాం. సినిమా అందరికీ నచ్చుతుందని మాత్రమే ఊహించాం. కానీ ఇంత పెద్ద రెస్పాన్స్ మాత్రం ఊహించలేదు. మేం గుడ్ పీస్ తీశామని నమ్మాం, కానీ ఆడియన్స్ మాస్టర్ పీస్ తీశామంటున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి.”
సినిమా సక్సెస్ విషయంలో ఒకరికి క్రెడిట్ ఇవ్వడానికి ఎప్పుడూ వెనకాడడు విజయ్ సేతుపతి. మహారాజా విషయంలో కూడా అదే చేశాడు. ఈ సినిమాకు తను ఇచ్చిన సూచనలు-సలహాలు కంటే.. సినిమాలో నటించిన ఓ చిన్న పాప ఇచ్చిన ఇన్ పుట్స్ చాలా ఎక్కువని చెప్పుకొచ్చాడు.
“రెస్టారెంట్ కు వెళ్తే ఫుడ్ వస్తుంది, మన టేస్ట్ కు తగ్గట్టు కొంచెం షుగర్ లేదా ఉప్పు యాడ్ చేసుకుంటాం. అంతమాత్రాన ఆ ఫుడ్ మనం తయారుచేసినట్టు కాదు కదా. మహారాజా స్క్రీన్ ప్లే విషయంలో కూడా అదే జరిగింది. అది నేను క్రియేట్ చేయలేదు. నేను ప్రతి సినిమాకు ఇన్ పుట్స్ ఇస్తుంటాను, ఈ సినిమాకు కూడా ఇచ్చాను. అంతమాత్రాన అది నాది అయిపోదు. రెండు బ్రెయిన్స్ కలిస్తే మంచి ఐడియా వస్తుందనే నమ్మకం నాది. ఈ సినిమాకు సంబంధించి నా కంటే, అనురాగ్ కూతురుగా నటించిన చిన్న పాప తన ఎక్స్ ప్రెషన్స్ ద్వారా ఎక్కువ ఇన్ పుట్స్ ఇచ్చింది. ఆ క్రెడిట్ ఆమెకే ఇస్తాను.”
మహారాజా సినిమాతో మరోసారి తను ది బెస్ట్ అని నిరూపించుకున్నాడు విజయ్ సేతుపతి. తక్కువ బజ్ కారణంగా మొదటి రోజు పెద్దగా ఆక్యుపెన్సీ కనిపించలేదు ఈ సినిమాకి. కానీ ప్రస్తుతం మార్కెట్లో నిలదొక్కుకున్న సినిమా ఇదే.