విశాఖ అంటే భూ కబ్జాలు దందాలు అని గడచిన కొన్నాళ్ల నుంచి ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు పెద్దలు భూ కబ్జాలు చేశారని విపక్షాలు అంతా ఏకమై భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించిన మీదట ఆనాటి ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేయించి విచారణ జరిపింది. ఆ సిట్ నివేదిక ఏమైంది అన్నది తెలియదు.
ఈ లోగా వైసీపీ ప్రభుత్వం వచ్చింది. సిట్ టూ అంటూ మరో విచారణ జరిపించారు. ఆ నివేదిక కూడా ఏమైందో కూడా తెలియదు. మొత్తానికి చూస్తే విశాఖ భూములు కబ్జా అయ్యాయని టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. వాటికి సాక్ష్యంగా రెండు సిట్ లు కూడా ఏర్పాటు అయ్యాయి.
ముచ్చటగా మూడవ ప్రభుత్వం ఏపీలో కొలువు తీరింది. పాడిందే పాట అన్నట్లుగా అధికార పార్టీ నేతల నుంచి విశాఖ భూ దందాల మీద విచారణ జరిపిస్తామని ప్రకటనలు వస్తున్నాయి. పేదల భూములు అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ ఆరోపణలు ఉన్నాయి. వారు వీరు అవుతున్నారు కానీ భూ దందా దోషులు ఎవరో మాత్రం జనాలకు తెలియడం లేదు.
విశాఖ భూములు దోచుకున్న వారు ఎవరైనా బయటకు రావాల్సి ఉంది. ఇందులో రెండవ మాటకు తావు లేదనే అంటున్నారు. అయితే కొత్త ప్రభుత్వం సిట్ ని నియమిస్తుందా లేక సీఐడీ విచారణకు ఆదేశిస్తుందా అన్నది తెలియదు కానీ సమగ్రమైన విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు మేధావులు కోరుతున్నారు
గత పదేళ్ళుగా విశాఖలో దోచుకోబడిన దందా చేయబడిన భూముల వివరాలు అన్నీ బయట పెట్టి అందుకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలనే అంతా కోరుతున్నారు. భూ దందాలకు విశాఖ నిలయం కాకూడదని సామాన్యుడి భూమి మీద ఇక మీదట ఎవరూ కన్నేయకుండా చూడాల్సిన బాధ్యత పాలకుల మీదనే ఉందని అంటున్నారు. గత దశాబ్ద కాలంగా భూ దందాల మీద కొత్త సర్కార్ విచారణ జరిపిస్తుందా అన్నదే చూడాల్సి ఉంది.