సినిమాకు సంబంధించి ఏదైనా జరిగితే ముందుగా లీకుల పేరిట వాస్తవాలు బయటకొస్తాయి. వాటిని మేకర్స్ నిర్థారించరు. అలా గాసిప్స్ గానే ఉంచుతారు. ఈలోగా జనాలు మానసికంగా సిద్ధమైపోతారు. ఆ తర్వాత కూడా వివరం చెప్పరు. ప్రేక్షకులకు ఆటోమేటిగ్గా అర్థమైపోతుందంతే.
ఓజీ సినిమా వాయిదా పడింది. మేకర్స్ చెప్పారా..? అస్సలు చెప్పలేదు. వారం రోజులుగా లీకులు వదిలారు. ఏదో జరుగుతోందని ప్రేక్షకులు ఓ అంచనాకు వస్తారు. అంతలోనే ఓజీ సినిమా విడుదల తేదీతో దేవర పోస్టర్ వచ్చింది. అలా ఓజీ వాయిదా అని అందరికీ అర్థమైంది.
ఇప్పుడు పుష్ప-2 విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమా విడుదలపై కూడా వారం రోజులుగా అనుమానాలు. అవి వాస్తవాలే అయినప్పటికీ మనం వాటిని గాసిప్స్ గానే చూడాలి. ఎందుకంటే యూనిట్ చెప్పలేదు కాబట్టి. పుష్ప-2 చెప్పిన తేదీకి రాదని జనాలంతా ఫిక్స్ అయిపోయారు.
అదిగో అలా ఫిక్స్ అయిన తర్వాత వచ్చింది డబుల్ ఇస్మార్ట్ పోస్టర్. అందులో రామ్ ఫొటో, దాని వెనక ఆగస్ట్ 15 రిలీజ్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు-అంకెలు. ఇక్కడ కూడా పుష్ప-2 వాయిదా అని ఎవ్వరూ చెప్పలేదు. మనం అర్థం చేసుకోవాలంతే.
కొన్ని రోజుల కిందట కల్కి విషయంలో కూడా ఇలానే జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సినిమా రాదని అందరికీ తెలిసిపోయింది. తాము రావట్లేదని మేకర్స్ చెప్పలేదు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి కొత్త విడుదల తేదీతో పోస్టర్ వదిలారు.
త్వరలోనే పుష్ప-2 విషయంలో కూడా ఇదే జరగబోతోంది. అయితే పుష్ప-2 ఎందుకు వాయిదా పడిందో తెలుసా? ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. సుకుమార్ డైరక్టర్ కాబట్టి బ్యాలెన్స్ ఉండిపోయిందని సర్దిచెప్పుకోవడానికి వీల్లేదు. ఏకంగా 60 రోజుల షూటింగ్ పెండింగ్ లో పడిందంట. అది షూటింగా.. రీ-షూటింగా అనేది మరో పెద్ద చర్చ. అదీ సంగతి.