మంత్రి పదవులు పూర్తి అయ్యాయి. ఎవరికి ఏమి దక్కాలో దక్కింది. ఇక అందరి చూపూ నామినేటెడ్ పదవుల మీద ఉంది. ఏపీలో అయితే నాలుగు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన వారి విషయంలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం తో అనర్హత వేటు పడగా ఖాళీ అయినవి.
ఉత్తరాంధ్రలో విశాఖ నుంచి వంశీ క్రిష్ణ శ్రీనివాస్, విజయనగరం నుంచి రఘురాజుల మీద అనర్హత వేటు పడింది. ఆ ఎమ్మెల్సీ పదవుల కోసం సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. జగన్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీ కోసం ఎదురుచూసి దక్కనందుకు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన సీనియర్ నేత ఒకరు చంద్రబాబు భజన చేస్తున్నారు.
ప్రజా ప్రభుత్వం అంటే ఇదే కదా అంటున్నారు. గతంలో ఇదే సీనియర్ నేత వైఎస్ జగన్ ఎన్టీఆర్ కి సరిసాటి అని పోలిక పెడుతూ బాబుని నానా మాటలూ అన్నవారే. ఆయనకు చంద్రబాబు ఒకసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు దానికి కంటిన్యూ చేయలేదని అలిగి వైసీపీలోకి వచ్చారు అలా అటూ ఇటూ తిరిగి తన పొలిటికల్ కెరీర్ ని చెడగొట్టుకున్న ఆయన ఇపుడు బాబు వైపు ఆశగా చూస్తున్నారు.
ఆయనే కాదు ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, పోటీలో నుంచి బాబు మాట విని పక్కకు తప్పుకున్న వారు సీనియర్ నేతలుగా చిరకాలం పార్టీకి సేవ చేస్తున్న వారు ఇలా చాలా మంది ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తొందరగా అటక మీద ఉన్న నామినేటెడ్ బూరెల బుట్టని కిందకు దించితే తమకు అవకాశం దక్కుతుందని వారంతా ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు ఈసారి మారారు అని అంతా నమ్ముతున్నారు దాంతో ఆయన ఏ మాత్రం లేట్ చేయకుండా పదవుల పందేరం మొదలెడతారని అందులో తమ వాటా అందుకోవాలని సీనియర్లు ఎదురుచూస్తున్నారు. మరి కొందరు అయితే ఇంకా ఏవైనా పెద్ద పోస్టులు ఉంటే వాటిలో కుదురుకోవాలని ఆశ పడుతున్నారు. అయితే అక్కడ ఉన్నది రాజకీయ చాణక్యుడు చంద్రబాబు. ఆయన ముందు ఈ భజనలు పనిచేస్తాయా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది.