ఈ పేటకు నేనే మేస్త్రి అని ఒక పాట ఉంది. అలా చరిత్రను తిరగరాసి పాయకరావుపేట కు ఆమె ఏకైక మంత్రిగా నిలిచారు. సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు. 1952లో పాయకరావుపేట నియోజకవర్గం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు కానీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. అంతదాకా ఎందుకు జగన్ ప్రభుత్వంలో తప్పకుండా మంత్రి అవుతారు అనుకున్న గొల్ల బాబూరావుకు ఆ చాన్స్ తృటిలో తప్పిపోయింది.
అందుకే ఇపుడు వంగలపూడి అనిత పేట చరిత్రలో కొత్త సెన్సేషన్ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా హిస్టరీ చూసుకుంటే మాడుగుల, ఎలమంచిలి, అనకాపల్లి, నర్శీపట్నం, చోడవరం, పాడేరు అరకు నియోజకవర్గాల నుంచి కూడా మంత్రులు అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఆ మధ్యలోనే ఉన్న పాయకరావుపేట మాత్రం ఎటువంటి పుణ్యం కట్టుకోలేకపోయింది.
ఇపుడు ఆ కొరతను పూర్తి స్థాయిలో తీరుస్తూ అనిత మంత్రి కావడమే కాదు టాప్ ఫైవ్ మినిస్టర్ పోర్ట్ పోలియోలలో ఒకటైన హోం శాఖను అందుకున్నారు. అంతే కాదు ఉమ్మడి విశాఖ జిల్లా మూడు జిల్లాలు అయింది. ఈ మొత్తానికి ఆమె ఏకైక మంత్రి.
అలా మూడు జిల్లాల మంత్రిగా ఆమె ఉన్నారు. ఉత్తరాంధ్రకు నాలుగు దశాబ్దాల తరువాత హోం మంత్రి పదవిని చేపట్టిన వారుగా నిలిచారు. గతంలో కొన్నాళ్ళ పాటు కళా వెంకటరావు హోం మంత్రిగా పనిచేశారు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. తిరిగి ఇన్నేళ్ళకు హోం మంత్రి పదవి ఉత్తరాంధ్ర కు దక్కింది. ఇదంతా అనిత వల్లనే అంటున్నారు. ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా ఉన్న ఆమె రాజకీయాలోకి ప్రవేశించిన కేవలం పదేళ్ల కాలంలోనే కీలక స్థానికి చేరుకోవడం విశేషంగానే అంతా చూస్తున్నారు.